దారుణం.. మెడిసన్‌ చదవమన్నాడని.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికిన కొడుకు

లక్నోలో అత్యంత కిరాతకమైన ఘటన వెలుగుచూసింది. నీట్ (NEET) పరీక్షకు సిద్ధం కావాలని తండ్రి పదేపదే ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి గురైన ఓ 19 ఏళ్ల యువకుడు, తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిపెట్టాడు.
వర్ధమాన్ పాథాలజీ యజమాని అయిన మానవేంద్ర ప్రతాప్ సింగ్ ఫిబ్రవరి 20 నుంచి కనిపించకుండా పోయారు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.


పోలీసులు విచారణ చేపట్టగా, ఇంట్లోని ఒక డ్రమ్ములో మానవేంద్ర మృతదేహం భాగాలు లభ్యమయ్యాయి. పోలీసులు ఆయన కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, తనే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. అక్షత్ ఇంటర్మీడియట్ (బైపీసీ) పూర్తి చేసి ప్రస్తుతం బీకామ్ చదువుతున్నాడు. అయితే, అతని తండ్రి మాత్రం పట్టుబట్టి నీట్ పరీక్షకు ప్రిపేర్ కావాలని రోజూ తిట్టేవాడు. ఫిబ్రవరి 20న ఇదే విషయంలో తండ్రీకొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంలో అక్షత్ తన తండ్రిని రైఫిల్‌తో కాల్చి చంపాడు.

హత్య చేసిన తర్వాత అక్షత్ మృతదేహాన్ని మూడవ అంతస్తు నుండి కిందికి తెచ్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. కొన్ని భాగాలను సదరోనా గ్రామం సమీపంలో పడేసి, మిగిలిన భాగాలను ఇంట్లోనే ఉన్న ఒక డ్రమ్ములో దాచిపెట్టాడు. పోలీసుల విచారణలో అక్షత్ తల్లి 2018లోనే మరణించినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసులు అక్షత్‌ను అరెస్ట్ చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.