ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) శుభవార్త చెప్పింది. 60 ఏళ్ల లోపు ఉద్యోగి చనిపోతే రెగ్యూలర్‌గా వచ్చే బెనిఫిట్లతో పాటు అదనంగా రూ.10 లక్షలు ఇచ్చేలా కేబినెట్(Telangana Cabinet)లో నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17.7 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయ్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. 1998 వ్యాధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఆసుపత్రుల్లో చికిత్స అందించనున్నారు. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5 శాతం ట్రస్టుకు జమ అయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఉద్యోగుల నుంచి రూ.528 కోట్లు ట్రస్టు ఖాతాలో జమ చేయనున్నారు. ఉద్యోగులతో సమానంగా ట్రస్టుకు ప్రభుత్వం సైతం జమ చేయనుంది. సీఎస్, సభ్యుల ఆధ్వర్యంలో ట్రస్టు నిర్వహణ కొనసాగనుంది. అంతేగాకుండా.. ఉద్యోగులు, పెన్షనర్ల నగదు రహిత చికిత్స పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా, మండల కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.




































