ప్రొబయాటిక్స్.. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాదు.. పలు ఆరోగ్య ప్రయోజనాల్నీ అందిస్తాయట! ముఖ్యంగా మహిళలు వీటిని తీసుకోవడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందామా
ఆ ఇన్ఫెక్షన్లకు దూరంగా..
సాధారణంగా పురుషుల కంటే మహిళల్లో మూత్ర నాళ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. 50 నుంచి 60 శాతం మంది మహిళలు తమ జీవితకాలంలో ఈ సమస్యను ఒక్కసారైనా ఎదుర్కొంటారని పరిశోధనలు చెబుతున్నాయి. కొంతమంది మహిళల్లో ఈ సమస్య తరచుగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారు ప్రొబయాటిక్స్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు. వీటిలోని మంచి బ్యాక్టీరియా జననేంద్రియాల దగ్గర ఉండే చెడు బ్యాక్టీరియాతో పోరాడి మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుందట.
బ్యాక్టీరియాకు విరుగుడు!
వెజైనాలో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందితే ‘బ్యాక్టీరియల్ వెజైనోసిస్’ అనే సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది నెలసరిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. ఈ ఇన్ఫెక్షన్ గర్భధారణ సమయంలోనూ పలు సమస్యలకు కారణమవుతుందట! అందుకే ప్రొబయాటిక్స్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి పరిష్కారం పొందచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి ప్రొబయాటిక్స్ అధికంగా ఉండే పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి.
మూడ్ స్వింగ్స్…
గర్భధారణ, నెలసరి, మెనోపాజ్ దశల్లో.. హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల మూడ్ స్వింగ్స్ వేధిస్తుంటాయి. ప్రొబయాటిక్స్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఈ సమస్యను అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు నిపుణులు.
వేటిలో అధికం?
పులియబెట్టిన ఆహారపదార్థాల్లో ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో పెరుగు ముఖ్యమైనది. అందుకే ప్రతి రోజూ పెరుగుని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పెరుగు తినని వారు మజ్జిగ తీసుకోవచ్చు. పెరుగు తర్వాత ఇడ్లీ, దోసెల్లో ప్రొబయోటిక్స్ అధికంగా ఉంటాయి. వీటితో పాటు అరటి, యాపిల్, ఉల్లి, వెల్లుల్లి.. మొదలైన వాటిలోనూ ప్రొబయాటిక్స్ లభిస్తాయంటున్నారు.



































