CM Revanth Reddy: మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పొటీపడేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, గోడౌన్లకు కట్టించేలా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.
పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటుచేసిన మహిళా సంఘాల ఉత్పత్తులను సీఎం పరిశీలించారు. స్టాల్స్ లోని వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళా పెట్రోల్ బంక్ ల నమూనాను పరిశీలించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించారు.
పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘ఇందిరమ్మ రాజ్యం రావాలని మహిళలు కోరుకున్నారు. గత పదేళ్లు రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టింది. చంద్రగ్రహణం అంతరించి పోవడంతో మహిళలు స్వేచ్ఛగా ఉన్నారు. కేసీఆర్ పాలన, కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను మహిళలు గమనిస్తున్నారు. తెలంగాణలో 65 లక్షల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల్లో ఉన్నారు. ప్రభుత్వ స్కూల్స్ నిర్వహణను స్వయం సహాయ సంఘాలకు అప్పగించాం. స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కుట్టే బాధ్యతను కూడా వీరికే ఇచ్చాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పొటీపడేలా చేస్తాం. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఇందిరా శక్తి భవనాలు నిర్మిస్తున్నాం. సోలార్ ఉత్పత్తిలో అదానీ, అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీపడేలా చేస్తాం. మహిళలు ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారు. కేసీఆర్ మొదటి టర్మ్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో.. మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చి గెలిపించుకుంటాం. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, గోడౌన్లకు కట్టించేలా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తే వన్ ట్రిలియన్ ఎకానమీ సాధ్యమవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను మహిళామణులు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలితే పైశాచిక ఆనందం పొందతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల ఆనందం కోసం తనను టార్గెట్‌గా చేసుకుని నోటికొచ్చినట్లు వాగుతున్నారని మండి పడ్డారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రయత్నించాలని.. పైశాచిక ఆనందం పొందేటోళ్లు ఎన్నటికీ బాగుపడరని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ వాళ్ళు టన్నెల్ కూలితే సంతోష పడుతున్నారు. పంట ఎండిపోతుంటే ఆనందపడుతున్నారు. నన్ను తిట్టడానికి ఇవన్నీ కోరుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.