శరీరంలో అదనపు కొవ్వు గురించి ఇకపై ఆందోళన చెందవల్సిన అవసరం లేదు. ఈ కింది న్యాచురల్ డ్రింక్స్ సాయంతో సులభంగా బరువు తగ్గొచ్చు. మార్కెట్లో దొరికే రసాయన పానీయాలు కాకుండా ఈ సహజసిద్ద పానియాలు రోజూ క్రమం తప్పకుండా తాగితే సరి.
కొవ్వు తగ్గడంతోపాటు బరువు కూడా అదుపులో ఉంటుంది.ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసుడు నీళ్లలో 2 నుంచి 3 టీస్పూన్ల ఉసిరి రసాన్ని కలిపి, రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో సేవిస్తే, కొవ్వు తగ్గడమే కాకుండా చర్మ కాంతిని పునరుద్ధరిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నిమ్మకాయల్లో కూడా విటమిన్ సి ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి. ఈ నీటిని పరగడుపున తాగితే 7 రోజుల్లోనే ఫలితాన్ని పొందొచ్చు.
కొబ్బరి బోండం నీళ్లలో అధిక పోషకాలు, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జీవక్రియను పెంచడం ద్వారా శరీర తేమను నిలపుకోవడానికి, అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ ఒక గ్లాస్ నీళ్లు తాగినా మేలే. అలాగే అల్లం టీ కూడా శరీర ఉష్ణోగ్రత, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. అల్లం టీ తాగలేకపోతే కొన్ని అల్లం ముక్కలను వేడి నీటిలో వేసి పది నిమిషాలు మరిగించి ఆ నీటిని తాగినా చాలు.
యాపిల్ సైడర్ వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ పానీయం పొట్ట, నడుము కొవ్వును పోగొట్టడానికి అద్భుతమైన ఔషధం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక టీస్పూన్ తేనె కలిపి భోజనానికి ముందు తాగాలి. ఇది శరీరంలో కొవ్వును ఇట్టే కరిగిస్తుంది.
బ్లాక్ కాఫీ చాలా కెఫిన్ ఉంటుంది. ఇది శరీరం జీవక్రియ రేటును పెంచడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ చక్కెర లేని బ్లాక్ కాఫీ మాత్రమే తాగాలి. పంచదార, పాలు అస్సలు వేసుకోకూడదు.