టీ20 వరల్డ్ కప్-2024కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికాను చాలా మంది లైట్ తీసుకున్నారు. క్రికెట్లో పసికూన కావడంతో మెగా టోర్నీలో ఆ జట్టు ఏం చేయలేదని తక్కువ అంచనా వేశారు. అయితే భారత్, వెస్టిండీస్ సంతతి ప్లేయర్లతో నిండిన యూఎస్ఏ సత్తా ఏంటో ఇప్పుడు బయటపడింది. టాలెంటెడ్ క్రికెటర్స్‌తో ఉన్న ఆ టీమ్ మెగా టోర్నీకి కిక్ స్టార్ట్ ఇచ్చింది. ఫస్ట్ మ్యాచ్‌లో కెనడాను చిత్తుగా ఓడించింది.
ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో అగ్రరాజ్యం 7 వికెట్ల తేడాతో గెలిచింది. కెనడా సంధించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 14 బంతులు ఉండగానే ఛేదించింది యూఎస్ఏ. దీంతో ఆ దేశ క్రికెట్ హిస్టరీలో ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచింది.
కెనడా సంధించిన టార్గెట్‌ను అందుకునేందుకు బరిలోకి దిగిన యూఎస్ఏను.. ఆండ్రీస్ గౌస్ (46 బంతుల్లో 65), ఆరోన్ జోన్స్ (40 బంతుల్లో 94) విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా జోన్స్ భారీ షాట్లు బాదుతూ కెనడా బౌలర్లకు చుక్కులు చూపించాడు. ఏకంగా 10 సిక్సులు బాది ప్రత్యర్థులకు నరకాన్ని పరిచయం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు పలు రికార్డులు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో సక్సెస్ఫుల్ రన్ ఛేజ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన నాన్ ఓపెనర్‌గా జోన్స్ అరుదైన ఘనత సాధించాడు. ఇంతకుముందు ఎవరికీ ఇది సాధ్యం కాలేదు.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచ కప్‌లో ఛేజింగ్‌లో ఎన్నోమార్లు జట్టును గెలిపించాడు. అయితే సక్సెస్ఫుల్ రన్ ఛేజ్‌లో మాత్రం ఇంత స్కోరు బాదలేదు. ఈ రికార్డుతో పాటు టీ20 ప్రపంచ కప్ మ్యాచుల్లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు జోన్స్. ఫస్ట్ ప్లేస్‌లో క్రిస్ గేల్ (11 సిక్సులు) ఉండగా.. జోన్స్ (10 సిక్సులు) రెండో స్థానంలో నిలిచాడు. ఇలా ఒక్క ఇన్నింగ్స్‌తో అందరి ఫోకస్‌ను తన వైపునకు తిప్పుకున్నాడీ యూఎస్ఏ ప్లేయర్. ఇక, కెనడాను చిత్తు చేసిన జోష్‌లో ఉన్న అమెరికా.. నెక్స్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.