తిరుమల (Tirumala) శ్రీవారి హుండీలో చోరీ జరిగింది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమిళనాడులోని శంకరన్ కోవిల్కు చెందిన వేణులింగం అనే యువకుడు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న స్టీల్ హుండీలో నగదును దొంగలించే ప్రయత్నం చేశాడు.
ఆ క్రమంలో కొంత నగదు తస్కరించి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది.
విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు పట్టుకున్నారు. అనంతరం అతడిని భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించారు. విచారణ సందర్భంగా అతడి వద్ద రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు