ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును గెలిపించిన తిలక్ వర్మ (Tilak Varma)పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన (India vs England) రెండో టీ20లో భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా (Team India) 19.2 ఓవర్లలో ఛేదించింది. తిలక్ (72*; 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆరంభంలో దూకుడుగా ఆడి ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించిన తిలక్.. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడటంతో మ్యాచ్ చివర్లో ఉత్కంఠభరితంగా మారింది. ఈక్రమంలో టెయిలెండర్లతో కలిసి జట్టును గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈనేపథ్యంలో తిలక్ వర్మపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్ టీ20 ప్లేయర్ మాత్రమే కాదని.. ఆల్-ఫార్మాట్ ప్లేయర్‌గా మారే సత్తా అతనికి ఉందన్నాడు.
‘‘టీమ్ఇండియాకు గొప్ప సూపర్‌స్టార్ దొరికాడని భావిస్తున్నా. అతను (తిలక్ వర్మ) టీ20 ప్లేయర్ మాత్రమే కాదు.. ఆల్-ఫార్మాట్ ప్లేయర్ కాగలడు. ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో గొప్ప పరిపక్వత ప్రదర్శించాడు. చాలా సంవత్సరాలపాటు భారత్‌కు మ్యాచ్ విన్నర్‌గా ఉండగల సత్తా అతనికి ఉంది. కాబట్టి ప్రతి ఫార్మాట్లో తిలక్‌కు అవకాశాలు ఇస్తూ మద్దతుగా నిలవాలి. అతను సూపర్‌స్టార్ క్రికెటర్. హైదరాబాద్‌కు ఆడుతున్నప్పటినుంచి అతడిని చూస్తున్నా. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అద్భుతంగా ఆడాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్‌పై నమ్మకం ఉంచాడు. తనపై పెట్టుకున్న నమ్మకానికి అతను న్యాయం చేస్తున్నాడు’ అని రాయుడు స్టార్‌స్పోర్ట్స్‌తో అన్నాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 మంగళవారం (జనవరి 28) రాజ్‌కోట్‌లో జరగనుంది. మూడో మ్యాచ్‌లో గెలిచి మరో రెండు టీ20లు మిగిలివుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమ్ఇండియా పట్టుదలతో ఉంది.