‘టైమ్‌ బ్యాంక్‌’.. ఇక్కడ సమయమే పొదుపు!

కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఓ వినూత్న బ్యాంకు ఏర్పాటైంది. ఇక్కడ డబ్బులు డిపాజిట్‌ చేయక్కర్లేదు. వయో వృద్ధులకు సాయం చేసేందుకు కొంత సమయాన్ని కేటాయిస్తే చాలు. ఇందుకు బదులుగా అంతే సమయాన్ని అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. ‘టైమ్‌ బ్యాంక్‌’గా పిలుస్తోన్న ఈ సేవా కార్యక్రమం ఎంతో మందికి తోడుగా నిలుస్తోంది.


ఒంటరితనంతో బాధపడుతున్న వయో వృద్ధులకు తోడుగా నిలిచేందుకు ‘టైమ్‌ బ్యాంక్‌’ పేరుతో ఓ డిజిటల్‌ వేదిక ఏర్పాటైంది. ఆసక్తి ఉన్నవారు ఫొటో ఐడీ, కేవైసీ వెరిఫికేషన్‌తో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితం. ఈ వాలంటీర్ల వివరాలను వృద్ధులు, వారి కుటుంబీకులకు సర్వీస్‌ ప్రొవైడర్లు తెలియజేస్తారు. 2019లో ఐదుగురు సభ్యులతో మొదలు పెట్టామని, ప్రస్తుతం 450 మంది వాలంటీర్లు చేరినట్లు టైమ్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు పీసీ జైన్‌ వెల్లడించారు.

వృద్ధులతో కొంత సేపు కాలక్షేపం చేయడం.. ఆసుపత్రులు, పార్కులు, దేవాలయాలకు తీసుకెళ్లడం.. ఆస్పత్రి చేరికల సమయంలో తోడుగా ఉండటం వంటి సేవలు చేయవచ్చు. సేవలందించే సమయాన్ని బట్టి వాలంటీర్ల డిజిటల్‌ అకౌంట్లలో క్రెడిట్లు నమోదు చేస్తారు. భవిష్యత్తులో వాలంటీర్లు లేదా కుటుంబ సభ్యులకు ఇటువంటి సేవలు అవసరమైతే.. మునుపటి (క్రెడిట్‌లను) సమయానికి సమానంగా వాలంటీర్ల సేవలను ఉచితంగా పొందవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.