Tirumala 7 Hills: తిరుమల 7 కొండలు మనిషిలోని 7 చక్రాలు – అద్భుతమైన 7 విషయాలు తెలుసా..?

Tirumala 7 Hills: తిరుమల7 కొండలకు మనిషిలోని 7 చక్రాలకు లింక్‌ ఉందని ఎంత మందికి తెలుసు..? ఏడుకొండలు ఏడు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలని మీలో ఎంత మందికి తెలుసు..? కుండలినీ యాక్టివేట్‌ అయితే మనిషిలోని ఏడు చక్రాలు ఎలా పనిచేస్తాయో అలాగే ఏడు కొండలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.


శేషాద్రి:

నిద్రిస్తూ ఉన్న కుండలినీ శక్తిని మేలుకోలపటమే ధ్యానం, ఇది క్రియాయోగం వల్ల సాధ్యపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని తాకుతుందో అప్పుడు ఈ నిద్రిస్తూ ఉన్న శక్తిని మనం శేషువు తో పోల్చూతాము అంటే నిద్రిస్తున్న పాము, ఈ చక్రం యాక్టివేట్‌ అయితే మనిషి వెన్నముకలో పాము పరుగెడుతున్న అనుభూతి కలుగుతుంది. అలాగే ఏడు కొండలలో మొదటి కొండ శేషాద్రి మూలాధార చక్రానికి ప్రతీకగా బావిస్తారు.

వేదాద్రి:

సాధకుడు ఇంకొంచెం ఎక్కువ ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిస్టాన చక్రాన్ని తాకుతుంది, అప్పటికి సాధకుడికి నూటికి 20% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయట. ఇక్కడ అంటే స్వాధిస్టాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణు గానం. వేదా అంటే వినటం అని అర్ధం. అందుకే రెండవ కొండకి వేదాద్రి అని పేరు వచ్చిందని బావిస్తారు.

గరుడాద్రి:

సాధకుడు మరికొంచెం ధ్యానం ఎక్కువ చేస్తే సాధకుని కుండలినీ శక్తి మణిపుర చక్రాన్ని తాకుతుంది, అప్పటికీ సాధకుడు నూటికి 40% సాధించినట్లు అని ఇప్పటికి సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది, జ్ఞాన శక్తి పెరుగుతుంది, గ్రహణశక్తి పెరుగుతుంది. “గ ‘ కార శబ్దం జ్ఞానానికి ప్రతీక, ఇక్కడికి వచ్చేటప్పటికి సాధకుడు జ్ఞాన అర్హుడు అవుతున్నాడు. అందుకే మూడవ కొండకి గరుడాద్రి అనే పేరు వచ్చిందని బావిస్తారట.

అంజనాద్రి:

సాధకుడు ఇంకా కొంత ఎక్కువ ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి అనాహత చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 60% సాధించినట్లు. ఇప్పటికి సాధకుడికి స్థూల శరీర స్పృహ తగ్గుతుంది. శరీరం చాల తేలిగ్గా, గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది, సాధకుడు వాయు పుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు. అందుకే నాలుగవ కొండకి.. అంజనాద్రి అని పేరు వచ్చిందని బావిస్తారు.

వృషబాద్రి:

సాధకుడు ఇంకొంచెం ఎక్కువ ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 80% సాధించినట్లు, భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. సంసార చక్రాలన్నీ దాటేస్తాడు, అన్ని బంధాలు విడిపోతాయి. ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది. ఇక పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎద్దుకి అచ్చు వేసి వదిలేస్తే ఎలా దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడుతుందో అలాగే మనిషి దేవునివైపు ఇష్టం వచ్చినట్టు పరుగెడుతుంటాడట.. అందుకే ఐదవ కొండకి వృషభాద్రి అని పేరు వచ్చిందని బావిస్తారు.

వెంకటాద్రి:

సాధకుడు ఇంకొంచెం ధ్యానం ఎక్కువ చేస్తే సాధకుని కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకుతుంది. ఇప్పుడు దాటి వచ్చిన ఆరు చక్రాలు ఆరు పడగలు విప్పినట్లు అనుకుంటే, ఆ పడగలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.. అనే ఆరు అరిషడ్వర్గాలని వేంకటరమణుడు (శ్రీ కృష్ణుడు) కాళీయ మర్ధనుడై దర్శనమిస్తూ సాధకుడి నుంచి పోగొట్టినట్లు అనుభూతి పొందుతాడు. మహా వెలుగు, తనే వెలుగుతునట్లు అనుభూతి చెందుతాడు. ఇప్పటికి సాధకుడికి, భగవంతుడు ఎదురుగానే ఉంటాడు. తనకి పరమాత్మకి మద్య ఇంకేమి ఉండదట. అందుకే ఆరవ కొండకు వెంకటాద్రిగా పేరు వచ్చిందని బావిస్తారు.

నారాయణాద్రి:

తరువాత సాధకుని కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని తాకుతుంది, ఇది పరమాత్మ చక్రం. ఇక అక్కడ సాధకుడు ఉండడట, నారాయణుడే ఉంటాడట. సాధకుడు తనే పరమాత్మ అవుతాడు, నారాయణ అంటే వ్యాపించటం అని అర్ధం. అంతటా తానేయై వ్యాపించేవాడు కాబట్టి నారాయణుడు. అందుకే ఏడవ కొండకి.. నారాయణాద్రి అనే పేరు వచ్చిందని బావిస్తారట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.