టారిఫ్‌ల కోసం ట్రంప్‌ ‘301’ ఆయుధం.. భారత్‌ సహా 16 దేశాలపై దర్యాప్తు

ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎడాపెడా విధించిన సుంకాలు చెల్లవంటూ అగ్రరాజ్య సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇతర దేశాల నుంచి ఎలాగైనా టారిఫ్‌ (Trump Traiffs)లు వసూలుచేయాలని కంకణం కట్టుకున్న ట్రంప్‌.. ఇందుకోసం కొత్తదారులు వెతుకుతున్నారు. తాజాగా ‘సెక్షన్ 301’ ఆయుధాన్ని బయటకు తీశారు. దీనికింద భారత్, చైనా సహా 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు అమెరికా (USA) వాణిజ్య శాఖ ప్రతినిధి జెమిసన్‌ గ్రీర్‌ కీలక ప్రకటన చేశారు.


1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్‌ 301 కింద.. భారత్‌, చైనా, యూరోపియన్‌ యూనియన్‌, సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, నార్వే, ఇండోనేసియా, మలేసియా, కంబోడియా, థాయ్‌లాండ్‌, దక్షిణ కొరియా, వియత్నాం, తైవాన్‌, బంగ్లాదేశ్‌, మెక్సికో, జపాన్‌ దేశాలపై ఈ దర్యాప్తు జరగనుందని గ్రీర్‌ వెల్లడించారు. కాగా.. ఈ జాబితాలో కెనడా లేకపోవడం గమనార్హం.

ఏంటీ సెక్షన్‌ 301
ఇతర దేశాలు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాలను సవాలు చేసేందుకు అమెరికాకు ఉన్న శక్తిమంతమైన ఆయుధమే ఈ సెక్షన్‌ 301. తమ వాణిజ్య భాగస్వాములు అనుసరిస్తున్న ట్రేడ్‌ పాలసీలు (Trade Policies).. అమెరికా వ్యాపారాలు, ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా? అనేదానిపై ఈ చట్టం కింద అమెరికా దర్యాప్తు చేసేందుకు వీలు లభిస్తుంది. ఒకసారి దర్యాప్తు ప్రారంభించిన తర్వాత.. అన్యాయమైన వాణిజ్య విధానాలపై అగ్రరాజ్యం సాక్ష్యాలను సేకరించే పనిలో ఉంటుంది. ఏదైనా దేశం తమకు నష్టం కలిగించేలా ట్రేడ్‌ పాలసీలను అనుసరిస్తుందని తేలితే.. ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి లేకుండానే ఆ దేశంపై ఏకపక్షంగా చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం కింద అధికారం ఉంటుంది. అలాంటి దేశాలపై చట్టబద్ధంగా భారీ సుంకాలు విధించడం లేదా ప్రతీకార చర్యలు తీసుకునేందుకు అమెరికాకు మార్గం లభిస్తుంది.

భారత్‌ను ఎందుకు చేర్చారు..?
చైనా లాంటి ప్రత్యర్థులతో పాటు భారత్‌ (India) వంటి మిత్రపక్షాల పైనా అమెరికా ఈ దర్యాప్తు చేపట్టడం చర్చకు దారితీసింది. భారత్‌లోని కొన్ని వాణిజ్య విధానాల వల్ల మన మార్కెట్లపై అమెరికాకు పరిమితులు ఉంటున్నాయని చాలాకాలంగా అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తంచేస్తోంది. కొన్ని ఉత్పత్తులపై భారత్‌ అమలుచేస్తోన్న అధిక సుంకాలు, స్థానిక తయారీ, డేటా స్టోరేజీ, టెక్నాలజీ నిబంధనలు వంటివాటిపై అమెరికా అభ్యంతరాలు తెలుపుతోంది. ఈ అంశాల పైనే కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, తాజా దర్యాప్తుతో భారత్‌పై వెంటనే పెనాల్టీలు పడే అవకాశం లేనప్పటికీ.. భవిష్యత్తులో కొన్ని రంగాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. దీంతో ఆయా రంగాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.