20 వేల డాలర్లు చెల్లిస్తే వేగంగా గ్రీన్‌కార్డు.. కొత్త యాక్ట్‌ను తెస్తున్న యూఎస్

అమెరికాలో గ్రీన్ కార్డు దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసేలా కొత్త బిల్లును ప్రవేశ పెట్టేందుకు ట్రంప్ సర్కారు ప్రయత్నిస్తోంది.


గ్రీన్ కార్డు కోసం పదేళ్లపైగా వెయిట్ చేస్తున్న వారు అదనంగా 20 వేల డాలర్లు చెల్లిస్తే.. వారి అప్లికేషన్‌ను తిరిగి పరిశీలించే కొత్త ప్రతిపాదనను ఫ్లోరిడా రిపబ్లికన్ రిప్రజంటేటివ్ మరియా ఎల్విరా సలాజార్, టెక్సాస్ డెమొక్రాట్ వెరోనికా ఎస్కోబార్ చేశారు. ఈ మేరకు ‘డిగ్నిటీ ఫర్ ఇమిగ్రంట్స్ వైల్ గార్డింగ్ అవర్ నేషన్ టు ఇగ్నయిట్ అండ్ డెలివర్ ది అమెరికన్ డ్రీమ్’ లేదా డిగ్నీటీ యాక్ట్ ఆఫ్ 2025ను యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు లెఫ్ట్, రైట్ రాజకీయాలకు సంబంధం లేనిదని, దశాబ్దాలుగా తప్పుల తడకలా ఉన్న వ్యవస్థను సరిచేసే చట్టమని మరియా సలాజార్ అన్నారు. యూఎస్ ఇమిగ్రేషన్ వ్యవస్థలో మార్పులు రావాలనే డిమాండ్ల నేపథ్యంలోనే ఈ బిల్లును తెచ్చినట్లు తెలుస్తోంది.

ఈ బిల్లు ప్రకారం, కుటుంబం లేదా ఉద్యోగం ఆధారంగా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసి పదేళ్లకు పైగా ఎదురు చూసిన వారు.. 20 వేల డాలర్ల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సాధారణ క్యూ నుంచి తప్పుకొని, త్వరగా గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉంటుంది. గ్రీన్ కార్డు వెయిటింగ్‌పై గరిష్ట పరిమితిని విధించి, వచ్చే పదేళ్లలో గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్స్‌ను క్లియర్ చేసేందుకు ఈ బిల్లు తెచ్చినట్లు సమాచారం. అలాగే దేశాలపై విధించిన 7 శాతం క్యాప్‌ను కూడా 15 శాతానికి పెంచనున్నారు. భారత్ వంటి హైడిమాండ్ దేశాల నుంచి వచ్చే వారికి గ్రీన్ కార్డు త్వరగా అందేలా చేయడం, అలాగే వివిధ దేశాల అభ్యర్థుల మధ్య వెయిటింగ్ టైంలో భేదాల సమస్యను పరిష్కరించడం కూడా ఈ బిల్లు లక్ష్యాలే.

ధ్రువపత్రాలు సరిగా ఉన్న డ్రీమర్లు (యూఎస్ కలలతో వచ్చే వ్యక్తులు), లీగల్ స్టేటస్ కోల్పోయే వయసుకు వచ్చిన వారి పిల్లలకు శాశ్వత నివాసం కల్పిస్తుందీ బిల్లు. దీని ప్రకారం, యూఎస్‌లో కనీసం పదేళ్లు నివశించిన వారికి చట్టపరమైన శాశ్వత నివాసం (ఎల్‌పీఆర్) పొందడానికి అర్హత లభిస్తుంది. ఇమిగ్రేషన్ వ్యవస్థలో కొన్ని కీలక సంస్కరణలు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.

  • ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను డ్యూయల్ ఇంటెంట్‌గా మారుస్తారు. అంటే అంతర్జాతీయ విద్యార్థులు తిరిగి స్వదేశాలకు వెళ్లకుండా, యూఎస్‌లో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)లో ఉన్న విద్యార్థులు కూడా సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ ట్యాక్సులు కూడా కట్టాల్సి ఉంటుంది.
  • వీసా దరఖాస్తుదారుల జీవిత భాగస్వాములు, పిల్లలను వార్షిక వీసా కౌంట్ నుంచి తప్పిస్తారు. దీని వల్ల పరిమితులు పెంచకుండానే ప్రాథమిక లబ్దిదారుల సంఖ్యను పెంచే అవకాశం ఉంటుంది.
  • ఓ వీసా అర్హత సాధించిన స్టెమ్, వైద్య రంగాల్లో అంతర్జాతీయ డాక్టోరల్ గ్రాడ్యుయేట్లకు అత్యుత్తమ నైపుణ్యాలు కూడా ఉన్నాయని భావిస్తారు.

వీటన్నింటితోపాటు ఫెడరల్ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని మెరుగు పరిచేందుకు ప్రత్యేకంగా ‘ఇమిగ్రేషన్ ఏజెన్సీ కోఆర్డినేటర్’ను ఏర్పాటు చేస్తారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) విభాగాల్లో వీసా ఆథరైజేషన్లలో బ్యాక్‌లాగ్స్, ప్రాసెసింగ్ ఆలస్యాలు, తదితర సమస్యలను పరిష్కరించేందుకు 3.6 బిలియన్ డాలర్లు కేటాయించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. దీనికి ఆమోదం పొందితే గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి వేచిచూస్తున్న భారతీయుల కలలు వేగంగా నెరవేరే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.