గడిచిన పది రోజులుగా ఇరాన్‌పై అమెరికా భీకర స్థాయిలో దాడులు చేస్తోంది. ఇందుకోసం అత్యాధునిక ఆయుధాలను వాడుతోంది. ఇలా యుద్ధం మొదలైన తొలి రెండు రోజుల్లోనే 5.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.51వేల కోట్లు) విలువైన ఆయుధ సామగ్రిని అమెరికా వినియోగించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది. సైనికులు, యుద్ధవిమానాలు లేదా నౌకా దళాలను మోహరించేందుకు అయిన ఖర్చు దీనికి అదనమని పేర్కొంది.
ఇరాన్‌పై ఫిబ్రవరి 28న యుద్ధం మొదలుపెట్టిన అమెరికా.. గగనతల రక్షణ వ్యవస్థలు, టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు సహా వందలాది అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తోంది. ఈ క్రమంలో ఆయుధాల వినియోగంపై ఇటీవల ఓ అంచనాల నివేదిక అమెరికా చట్టసభ ముందుకు వచ్చింది. ఏయే ఆయుధ సామగ్రిని ఎంత మొత్తంలో వినియోగించిందనే వివరాలు బయటకు తెలియనప్పటికీ.. తొలి రెండు రోజుల్లోనే ఉపయోగించిన ఆయుధ సామగ్రి విలువ రూ. 5.6 బిలియన్ డాలర్లు ఉంటుందని కొందరు అధికారులు అంచనా వేశారు. మరోవైపు, పశ్చిమాసియాలో సైనిక ఆపరేషన్లను పర్యవేక్షించే అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ఇప్పటివరకు 5వేల లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది.
ఇలా ఖరీదైన ఆయుధాలను భారీ సంఖ్యలో వినియోగించడంపై కొందరు చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరి వాదనను వైట్‌హౌస్ వర్గాలు తోసిపుచ్చాయి. అధ్యక్షుడు నిర్ణయాలను అమలుచేసేందుకు రక్షణశాఖ సిద్ధంగా ఉందని పెంటగాన్ చీఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు, ఇరాన్‌లో దాడులను కొనసాగించేందుకు అవసరమైన అనుబంధ బడ్జెట్‌ను కాంగ్రెస్‌కు పంపించే యోచనలో ట్రంప్ యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ బడ్జెట్ ప్రతిపాదనపై డెమొక్రాట్‌ల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

































