అమెరికా, ఇజ్రాయెల్‌తో చేస్తోన్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకువచ్చింది. కానీ మూడు షరతులు విధించింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘‘పశ్చిమాసియా ప్రాంతంలో శాంతికి ఇరాన్ (Iran) కట్టుబడి ఉంది. రష్యా, పాకిస్థాన్ నాయకులతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించాను. అమెరికా రగిల్చిన యుద్ధాన్ని ముగించేందుకు మా మూడు షరతులను అంగీకరించాలి. ఇరాన్ చట్టబద్ధ హక్కుల్ని గుర్తించాలి. నష్టపరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో దురాక్రమణలు జరగకుండా పటిష్ఠమైన అంతర్జాతీయ హామీలు ఉండాలి’’ అని అధ్యక్షుడు ఎక్స్‌లో రాసుకొచ్చారు.
ఇరాన్ వార్నింగ్…
ఒక బ్యారెల్‌కు 200 డాలర్ల చొప్పున చెల్లించేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని గురువారం ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. 1970 తర్వాత చమురు షాక్‌ను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా హెచ్చరిక వచ్చింది. మరోవైపు హర్మూజ్‌లో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలోకి అమెరికా (USA) మిత్ర దేశాల నౌకలు అడుగుపెడితే పేలిపోయేలా ఇరాన్ ఎక్కడికక్కడ ‘నేవల్ మైన్స్’ (సముద్రపు మందుపాతరలు) అమర్చడం ఆందోళన కలిగిస్తోంది.

































