అమెరికా- ఇజ్రాయెల్ దేశాలతో భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) తొలిసారి స్పందించారు. శత్రువులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు హర్మూజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందన్నారు. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగుతాయని, వాటిని తక్షణమే మూసివేయాలని హెచ్చరించారు. మినాబ్ పాఠశాలపై దాడి సహా ఆయా ఘటనలపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీం లీడర్ (Iran Supreme Leader) ప్రకటనను అధికారిక మీడియాలో ప్రసారం చేశారు. అయితే, యుద్ధం ప్రారంభంలో మొజ్తాబా ఖమేనీ గాయపడినట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పొరుగు దేశాలతో స్నేహాన్ని ఇరాన్ విశ్వసిస్తుందని.. అయినప్పటికీ అక్కడి అమెరికా స్థావరాలపై మాత్రం దాడులను కొనసాగుతాయని మొజ్తాబా ఖమేనీ అన్నారు. కష్ట సమయంలో తమ సైనికులు ధైర్యంగా పోరాడుతున్నారంటూ ప్రశంసించారు. పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు. దాడుల్లో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందించడంతో పాటు బాధిత కుటుంబాలను ఆర్థికంగానూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

































