విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika Mandanna) త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివాహం విషయంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విజయ్ తొలిసారి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అభిమానులు పిలుచుకుంటున్నట్లుగానే తమ వివాహ వేడుకకు ‘విరోష్’ (Wedding of VIROSH)గా పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు.
‘‘మేం ఏవైనా ప్లాన్స్ చేసుకుందామనుకున్నా, మా కోసం ఏదైనా ఎంచుకుందామనుకున్నా ముందుగా మీరే (అభిమానులు) అక్కడ ఉంటూ ఆ పనులు చేసి పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలోనూ చాలా ప్రేమతో ఒక పేరు పెట్టారు. మమ్మల్ని ‘విరోష్’ అని పిలుస్తున్నారు. అందువల్ల ఈరోజు హృదయపూర్వకంగా అభిమానుల గౌరవార్థం అదే పేరును స్వాగతిస్తున్నాం. మా పెళ్లి వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇంత ప్రేమాభిమానాలతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరెప్పుడూ మాలో ఒక భాగం. ప్రేమాభిమానాలతో..’’ -ఇన్‌స్టాలో విజయ్ దేవరకొండ పోస్ట్
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో కలిసి నటించిన విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ గతంలో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వీరు అధికారికంగా స్పందించకున్నా.. సామాజిక మాధ్యమాల్లో పంచుకునే పోస్ట్‌లతో పరోక్షంగా ఆ వార్తలకు బలాన్నిస్తూ వచ్చారు. త్వరలోనే ఈ జంట వివాహ వేడుక కోసం జోరుగా ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు సమాచారం. దీనిపైనా ఇప్పటివరకూ ఇద్దరూ స్పందించలేదు. కానీ, తొలిసారి విజయ్ దేవరకొండ తమ వివాహ వేడుకకు అభిమానులు పెట్టిన పేరునే ఖరారు చేస్తూ పోస్ట్ పెట్టడం విశేషం. అతి కొద్ది మంది సమక్షంలో వీరి వివాహ వేడుక జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ ఇందుకు వేదిక కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26న (rashmika vijay devarakonda marriage date) ఈ జంట మూడుముళ్లతో ఒక్కటి కానుంది.
ప్రస్తుతం ఇటు విజయ్ దేవరకొండ, అటు రష్మిక ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యన్ దీనికి దర్శకుడు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఈ చిత్రం విడుదల కానుంది.




































