బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడాలేంటి.. ఎందుకు వాడతారో తెలుసా…

www.mannamweb.com


బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండూ వంటగదిలో అవసరమైన పదార్థాలు. భారతీయులు బజ్జీలు, కేకుల వంటి వంటల్లో బేకింగ్ సోడా (Baking soda)ను వాడుతుంటారు.
అందం, ఆరోగ్యం కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు. దీనిని తినేసోడా, వంటసోడా అని కూడా పిలుస్తారు. అయితే బేకింగ్ పౌడర్ (Baking powder) కూడా అచ్చం దీని లాగానే కనిపిస్తుంది. చాలామంది ఈ రెండింటి మధ్య తేడా తెలియక వంటల్లో తప్పుగా వాడేస్తుంటారు.

చూసేందుకు ఒకేలా కనిపించినా ఇవి రెండూ వేర్వేరు పదార్థాలు. వీటి రుచులు కూడా వేరుగా ఉంటాయి. రుచి చూస్తే, ఇవి రెండు విభిన్నమైన పదార్థాలు అనే సంగతి తెలుస్తుంది. అవి జరిపే రసాయనిక చర్యలు కూడా విభిన్నంగా ఉంటాయి. వీటి మధ్య తేడాలేంటి; వీటిని ఎలాంటి వంటల్లో, ఎందుకు వాడతారో తెలుసుకుందాం.

* బేకింగ్ సోడా
బేకింగ్ సోడాను సైంటిఫిక్‌గా “సోడియం బైకార్బోనేట్” అంటారు. ఇది స్వచ్ఛమైన ఆల్కలీన్ పదార్థం. ఇది ఆమ్ల పదార్థాలను తాకినప్పుడు, ఒక కెమికల్ రియాక్షన్‌కి గురవుతుంది. ఈ రియాక్షన్ కారణంగా కార్బన్ డయాక్సైడ్ వాయువు రిలీజ్ అవుతుంది. ఈ వాయువు పిండి పులిసి ఉబ్బడానికి కారణమయ్యే బుడగలను ఏర్పరుస్తుంది. అందుకే బేకింగ్ సోడాను కేకులు, కుకీలు, పాన్‌కేక్‌లు, ఇతర బేకింగ్ డిష్‌లలో పులియబెట్టే ఏజెంట్‌ (Leavening agent)గా ఉపయోగిస్తారు.

అయితే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ విడుదల కావాలంటే బేకింగ్ సోడాకు రియాక్ట్ అయ్యే ఓ యాసిడిక్ సబ్‌స్టెన్స్ ఉండటం తప్పనిసరి. ఉదాహరణకు పిండిలోని సహజ ఆమ్లాలైన పెరుగు, నిమ్మరసం వంటి ఆమ్లాలతో బేకింగ్ సోడా రియాక్ట్ అయి కార్బన్ డయాక్సైడ్‌ను రిలీజ్ చేస్తుంది. బేకింగ్ సోడాను వంటల్లో మాత్రమే కాకుండా క్లీనింగ్ ఏజెంట్‌గా కూడా ఉపయోగిస్తారు. దీని ఆల్కలీన్ లక్షణాలు వాసనలను పోగొడతాయి,ఉపరితలాలను సమర్థవంతంగా క్లీన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

* బేకింగ్ పౌడర్

బేకింగ్ పౌడర్ అనేది ఒక యాసిడ్. సాధారణంగా ఇందులో టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. ఈ పౌడర్ సోడియం బైకార్బోనేట్, యాసిడ్, డ్రైయింగ్ ఏజెంట్ (మొక్కజొన్న పిండి వంటివి) కలయిక వల్ల వచ్చే మిశ్రమం. ఈ కలయిక వల్ల బేకింగ్ పౌడర్‌లో పులియబెట్టే ప్రక్రియకు అవసరమైన అన్ని పదార్థాలు ఉంటాయి.

ఇందులో ఆల్రెడీ ఒక ఆమ్లం ఉంటుంది కాబట్టి అది పని చేయడానికి ప్రత్యేకంగా ఆమ్ల పదార్థాలు అవసరం లేదు. ద్రవంతో కలిపినప్పుడు కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేయడం ప్రారంభిస్తుంది, వేడిచేసినప్పుడు మరింత ప్రతిస్పందిస్తుంది. అందుకే కొన్ని బేకింగ్ పౌడర్లను “డబుల్-యాక్టింగ్” అని లేబుల్ చేస్తారు.
* ఎప్పుడు ఉపయోగించాలి?

బేకింగ్ సోడాను నిమ్మరసం, వెనిగర్, పెరుగు, మజ్జిగ లేదా కోకో పౌడర్ వంటి ఆమ్లాలు ఉండే వంటకాల్లో ఉపయోగించాలి. ఈ పదార్థాలలోని యాసిడ్ బేకింగ్ సోడాను యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల పిండి బాగా పులిసి ఉబ్బుతుంది. సహజ ఆమ్లాలు లేని వంటకాల్లో బేకింగ్ పౌడర్‌ను మిక్స్ చేయవచ్చు. మెత్తటి, తేలికపాటి కన్సిస్టెన్సీ కోరుకునే వంటకాలకు ఇది సరైనది.