‘‘వయసులో ఉన్నారు.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు.. రండి..’’ అంటూ ఓ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శిక్షణకు వచ్చిన యువతులను లైంగికంగా వేధించాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని రకరకాలుగా ప్రలోభపెడుతూ లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఆ కీచకుడి బాధలు భరించలేక ఒక యువతి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో స్నేహితులు అడ్డుకున్నారు. దీంతో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. విజయనగరంలో సారిపల్లి శ్రీనివాసరావు వినెక్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 70 మంది యువతులు టెట్, డీఎస్సీ, ఎస్జీటీ శిక్షణకు చేరారు. ఒక్కొక్కరు రూ.50 వేలు చెల్లించారు. వారికి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. ఆ యువతులపై కన్నేసిన డైరెక్టర్ శ్రీనివాసరావు కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. శిక్షణ సమయం ముగిసిన తర్వాత ఒకరిద్దరిని ఏకాంతంగా తన ఛాంబర్‌లోకి పిలిపించి అసభ్యంగా ప్రవర్తించేవాడు.
దాడిచేసి.. బెదిరించి..
ఇటీవల ఒక యువతిని లైంగికంగా వేధించడమే కాకుండా తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. ఆమె ఎదురుతిరగడంతో గోడకేసి కొట్టాడు. గాయాలతో బాధపడుతున్న ఆమెకు ఫోన్ చేసి రావాలని పట్టుబడుతున్నాడు. కుటుంబ సభ్యులతో, సహచర అభ్యర్థినులతో చెబితే ఊరుకునేది లేదని బెదిరించాడు. ఒకరితో మరొకరు మాట్లాడకుండా కట్టుదిట్టం చేశాడు. దీనిపై పలువురు బాధితులు మాట్లాడుతూ.. ‘ఛాంబర్‌కు పిలిచి ఎక్కడెక్కడో తాకుతాడు. రకరకాలుగా బెదిరిస్తుంటాడు. చేరిన వారం నుంచే ఈ కీచకుడి వేధింపులు మొదలయ్యాయి’ అని బావురుమన్నారు. బుధవారం ఒక యువతి ఆత్మయత్నానికి కూడా పాల్పడగా అడ్డుకుని.. అంతా కలిసి పోలీసు స్టేషన్‌కు వచ్చామని చెప్పారు.
ఎక్కువ మార్కులు ఆశచూపి..
మాక్ టెస్ట్‌లో ఎక్కువ మార్కులు ఆశ చూపి శ్రీనివాసరావు తమపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడంటూ బాధిత యువతులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని డీఎస్పీ గోవిందరావు, సీఐ నర్సింహమూర్తి తెలిపారు. రాత్రి 10 గంటలు దాటడంతో గురువారం ఉదయం మళ్లీ వారితో మాట్లాడతామన్నారు. తన గుట్టు రట్టవడంతో డైరెక్టర్ శ్రీనివాసరావు పరారయ్యాడు.

































