ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌.. ఇండియాలోనే తయారైన ఈ బైక్‌ విడుదల ఎప్పుడంటే?

ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ని బజాజ్ ఆటో జూన్ 18, 2024న విడుదల చేయనుంది. దీనికి సంబంధించి బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ కొత్త పల్సర్ NS400z బైక్‌ లాంచ్‌ వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యంత చౌక ధరలో సీఎన్‌జీ బైక్‌ని తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు.


కొత్త బజాజ్ సీఎన్‌జీ (Bajaj CNG) మోటార్‌సైకిల్‌ 100-125 సీసీ ఇంజిన్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ బైక్‌ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్‌, వెనుక భాగంలో మోనో షాక్‌ని కలిగి ఉండనుంది. దీనితో పాటు డిస్క్ మరియు డ్రమ్ బ్రేక్ సెటప్‌లతో రానుంది. ఈ బైక్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సింగిల్-ఛానల్ ఎబిఎస్ లేదా కాంబి-బ్రేకింగ్ సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

ఈ బైక్‌కి ఎటువంటి పేరుని సంస్థ నిర్ణయించలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ బైక్‌కి “బ్రూజర్” (Bruzer) అనే పేరును ట్రేడ్ మార్క్ చేసింది. ఈ రిజిస్టర్డ్‌ చేయబడిన అఫీషియల్‌ పేరుతోనే బైక్‌ విడుదల అయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మొదటి బజాజ్ సీఎన్‌జీ బైక్‌తో భారత్‌లో కొన్ని విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్‌ ఆటో రంగంలో అగ్రగామిగా ఉంది. భవిష్యత్తులోనూ భారత్‌లో మరిన్ని సీఎన్‌జీ మోడళ్లు విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్‌ బైక్స్‌ మాత్రమే ఎక్కువగా చలామణీలో ఉన్నాయి. తాజాగా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్ వినియోగం పెరుగుతూ వస్తోంది. అందులో భాగంగానే చాలా కంపెనీలు ఈవీ రంగంపై దృష్టి సారించాయి. ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, అధిక రేంజ్‌ అందించే విధంగా వీటిని సంస్థలు రూపొందిస్తున్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో కార్లు, ఇతర వాహనాలు సీఎన్‌జీ ఇంజిన్‌తో నడుస్తున్నాయి. తాజాగా బజాజ్‌ ప్రకటనతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సాంప్రదాయ వానాలకు భిన్నంగా ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు చూస్తున్న జనం తాజాగా బజాజ్‌ ప్రకటనతో సీఎన్‌జీ వైపూ అడుగులు వేసే అవకాశం ఉంది. ఈ బైక్‌ ఒక్కసారి మార్కెట్‌లో విడుదల అయ్యాక దాని పనితీరు ఆధారంగా రెస్పాన్స్‌ వస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఈ బైక్‌ని సంస్థ రూపొందించి టెస్ట్ రన్‌ని కూడా సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. అయితే పెట్రోల్ మోటార్‌సైకిళ్లతో పోలిస్తే సీఎన్‌జీ బైక్‌ల ధర కాస్త ఎక్కువగానే ఉండనున్నాయి. అయితే ధరలు ఎక్కువే ఉన్న దాని వల్ల అనేక లాభాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అతి త్వరలోనే రాబోయే ఈ CNG మోటార్‌సైకిల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇతర సాధారణ బైక్‌ల కంటే కొద్దిగా భిన్నంగా ఉండనుంది. దీనివల్ల తయారీ వ్యయం పెంచినట్లు మార్కెట్‌ నిపుణులు తెలిపారు. అయితే, సీఎన్‌జీ బైక్ నిర్వహణ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల ధరల పెరుగుదల వినియోగదారులపై ఎటువంటి ప్రభావం ఉండదని వారు చెబుతున్నారు. ఈ బైక్‌ ధర రూ.80,000 కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇది కిలోకు 70 కిలోమీటర్లకు పైగా మైలేజీని అందిస్తుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి బజాజ్ కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా బైక్‌ విడుదల తేదీని ప్రకటించడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.