High Court: పన్ను చెల్లింపుదారులు, సంస్థలకు తరచుగా ఆదాయపు పన్ను శాఖ నుంచి వివరణ కోరుతూ నోటీసులు వస్తుంటాయి. మరికొన్ని సార్లు పెనాల్టీలకు సంబంధించిన నోటీసులు కూడా వస్తుంటాయి. వీటి విషయంలో ప్రజలు ఎప్పుడూ ఆందోళన చెందుతూనే ఉంటారు.
తాజాగా పన్ను చెల్లింపుదారుల హక్కులను పరిరక్షించే తీర్పును హైకోర్టు ఇచ్చింది. ఆదాయపు పన్న అధికారులు ఏదైనా చర్యలు తీసుకునే ముందు పన్ను చెల్లింపుదారులకు పూర్తి సమాచారాన్ని అందించాలని తన తీర్పులో వెల్లడించింది. ఈ తీర్పుతో పన్ను చెల్లింపుదారుల హక్కులతో పాటు ప్రభుత్వాలు బాధ్యతతో మెలగటంపై కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్ & హర్యానా హైకోర్టు ముంజాల్ BCU సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు వ్యతిరేకంగా నవంబర్ 2022 షో-కాజ్ నోటీసును రద్దు చేసింది. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటే ముందుగా నోటీసులు సరిగా అందించాలని కోర్టు పేర్కొంది. కేవలం నోటీసులను పన్ను అధికారులు తమ ఈ-పోర్టల్ లో ఉంచి దానిని సదరు వ్యక్తికి కమ్యూనికేట్ చేసినట్లు ఊహించుకోవటం సరైనది కాదని నొక్కి చెప్పింది.
ఆదాయపు పన్ను శాఖాధికారులు ముందుగా సదరు వ్యక్తిగా ఈమెయిల్ ద్వారా అందించాలనుకున్న నోటీసులను పంపాలని తన రూలింగ్ లో వెల్లడించింది. అలాగే సమన్లు, ఆర్డర్లు, నోటీసులు, అవసరమైన సమాచారం కోరటం, నిర్ధారణలు వంటి చర్యలకు మెయిల్స్ పంపాలని తీర్పులో సూచించింది. అంటే సరైన రీతిలో పన్ను చెల్లింపుదారులకు సమాచారం అందించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవటం సరైనది కాదని మందలించింది.