మూడు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా, నందిగామలోని అలెన్ హోమియో అండ్ హెర్బల్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమాదాన్ని గమనించిన 15 ఏళ్ల బాలుడు ఒకరు.. భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి.. సుమారు 50 మందిని కాపాడాడు. బాలుడి చూపిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సదరు సాహస బాలున్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఫార్మ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో అది గమనించిన విద్యార్థి సాయిచరణ్ వెంటనే స్పందించి.. బిల్డింగ్ మీదకు వెళ్లి తాడు కట్టి.. ప్రమాదంలో చిక్కుకున్న 50 మంది కార్మికులు బయటకు వచ్చేలా సాయం చేశాడు. ఇక బాలుడు ప్రదర్శించిన తెగింపు, దైర్య సాహసాల గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సాయి చరణ్, అతడి కుటుంబాన్ని తన నివాసానికి పిలిపించుకుని మరీ అభినందించారు. బాలుడి సాహసాన్ని మెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. శాలువా కప్పి.. అతడిని సన్మానించారు. సాయి చరణ్‌కి మంచి భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. సాయిచరణ్ చూపించిన ధైర్య, సాహసాలు ఎంతో మంది యవతకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామకు చెందిన సాయిచరణ్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. ఈ నెల 26న నందిగామలో స్థానిక ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. తన స్నేహితుడి తల్లి అదే కంపెనీలో పనిచేస్తుంది. ఇక ప్రమాదం గురించి తెలుసుకున్న సాయిచరణ్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే చాలా మంది కార్మికులు బయటికి వచ్చేయగా.. మరో 50 మంది వరకు భవనంలో చిక్కుకుపోయారు. కాపాడండి అంటూ అరుస్తున్న వారి ఆర్తనాదాలు విన్న సాయి చరణ్.. అగ్నిమాపక సిబ్బందికి సాయం చేశాడు.
వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ప్రమాదం జరిగిన బిల్డింగ్ నాలుగో అంతస్తుకు వెళ్లి.. తాడు కట్టి దాని సాయంతో అక్కడున్న వాళ్లు కిందికి వచ్చేలా సాయం చేశాడు. అతడు చూపిన తెగువ, ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల భవనంలో చిక్కుకున్న 50 మంది తాడు సాయంతో కిందకు దిగి.. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. లేదంటే ప్రాణ నష్టం సంభవించేది. ఆ సమయంలో సాయి చరణ్ చూపించిన ధైర్య సాహసాలను ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు. ఇక ఎమ్మెల్యే శంకర్ సాయి చరణ్‌కు 5 వేల రూపాయల రివార్డ్ ఇవ్వడానికి ముందుకు రాగా బాలుడు తిరస్కరించాడు. అతడి వ్యక్తిత్వంపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా సీఎం రేవంత్ కూడా సాయి చరణ్‌ను అభినందించాడు.