ఎవరికైనా పాము కనిపిస్తే చాలు.. గుండెలు కడుపులోకి జారిపోయి.. కాళ్లు గజగజా వణికిపోతాయి. తనను తాను కాపాడుకునేందుకు పరుగులు పెట్టటమో.. లేదా ఇంకొందరైతే ఆ పామునే చంపేయటమో చేస్తుంటారు. అయితే.. మనం ఎంత భయపడతామో.. పాములు కూడా మనిషిని చూస్తే అంతకంటే ఎక్కువగా బయపడతాయంటా. తనను తాను కాపాడుకునే చర్యలో భాగంగానే కాటు వేస్తాయన్నది నిపుణులు చెప్పే మాట. అయితే.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో మాత్రం అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది.
ఆపదలో ఉన్నప్పుడో, పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడో, చావుబతుకుల్లో ఉన్న సమయంలోనో మనకు ఎవరైన సాయం చేస్తే.. వారిని దేవుడిలా భావిస్తాం. వాళ్లు చేసిన మేలును గుర్తుపెట్టుకుని.. జీవితాంతం వాళ్లకు కృతజ్ఞులమై ఉంటాం. అది మనిషి స్వభావం.. దాంట్లో వింతేముంది.. అలా లేకపోతే వాడు అసలు మనిషే కాదు అంటారా.. అక్కడికే వస్తున్నా. కాపాడిన వ్యక్తికి కృతజులై ఉండటమనేది కేవలం మనిషి స్వభావం కాదు.. పాము స్వభావం కూడా అని నిరూపిస్తోంది ఈ నాగరాజు. తనను కాపాడిన రైతును మర్చిపోకుండా ప్రతి రోజూ వచ్చి.. కాచుకుంటోంది. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా.. తనను కాపాడిన రైతును చూస్తూ రోజంతా గడిపి.. అతను సాయంత్రం ఇంటికి వెళ్లాక.. తను కూడా అడవిలోకి వెళ్లిపోతుంది. ఇలా ఒకటి రెండు రోజులు కాదు.. దాదాపు ఏడాది కాలంగా జరుగుతోంది. అస్సలు నమ్మబుద్ది కావట్లేదు కదా.. కానీ ఇది అక్షరాల నిజం.. నమ్మలేని నిజం..!
మెదక్ జిల్లాలో కౌడిపల్లి మండలం భుజరంపేట కూకట్లపల్లి శివారులో కర్నె హరీష్ రెడ్డి అనే వ్యక్తికి మామిడి తోట ఉంది. అయితే.. ఆ తోటకు కంచెను ఏర్పాటు చేశాడు హరీశ్ రెడ్డి. కాగా.. ఓ రోజు ఆ కంచెలో నాగుపాము చిక్కుకుని ఉండడం గమనించాడు. సాధారణంగా అయితే.. ఎక్కడైనా పాము కనిపిస్తే.. అక్కడి నుంచి పరుగులు పెట్టటమో.. లేదా ఆ పామును పరుగులు పెట్టించటమో చేస్తాం. కానీ.. హరీష్ రెడ్డి మాత్రం ఆ రెండు పనులు చేయలేదు. పాము ఉన్న పరిస్థితిని గమనించాడు. కంచెలో ఇరుక్కుపోయి ఉండటాన్ని గమనించిన హరీశ్ రెడ్డి.. పాముకు ఎలాంటి హాని కలగకుండా అందులో నుంచి బయటకు వచ్చేలా చేశాడు. దీంతో.. ఆ పాము కూడా బయటకు వచ్చి హరీశ్‌కు ఎలాంటి హాని తలపెట్టకుండా అడవిలోకి వెళ్లిపోయింది.
అయితే.. ఇలాంటి ఘటనలో అక్కడక్కడా గ్రామాల్లో జరుగుతూనే ఉంటాయి. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ.. ఆ తర్వాతి రోజు కూడా ఆ పాము తోట దగ్గరికి వచ్చింది. అక్కడే ఉన్న ఓ చెట్టుపై కూర్చొని.. పని చేసుకుంటున్న హరీశ్ రెడ్డిని చూస్తూ.. ఉంది. అతను సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇలా.. ప్రతిరోజూ రావటం.. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా.. హరీశ్ రెడ్డిని చూస్తూ ఆ చెట్టుపైనే ఉండటం.. చీకటి పడగానే వెళ్లిపోవటం సర్వసాధారణమైంది. ఈ తంతు సుమారు ఏడాదిగా జరుగుతుండటం ఆశ్చర్యం కలిగించే అంశం.
దీంతో.. ఈ నమ్మనేని నిజాన్ని కళ్లారా చూసిన ఆ గ్రామస్థులు చివరికి నమ్మారు. పాముల్లో పగపట్టే వాటి గురించి విన్నాం కానీ.. ఇలా కృతజ్ఞత చూపే పామును ఇప్పుడే చూస్తున్నామని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ నాగుపామును.. దేవతగా భావిస్తూ.. పనులకు వెళ్లే సమయంలో దండం పెట్టుకుని పోతుండటం మరో వింతగా మారింది. ఈ విషయం సాధారణంగా చెప్తే కట్టుకథగా భావిస్తారని.. ఏకంగా మొబైల్‌లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి.