ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే పదవులు వస్తాయి. అధికార దర్పం వస్తుంది. ప్రభుత్వ పాలనలో భాగస్వాములు కావచ్చు. అదే పార్టీ నిర్ణయానికి కట్టుబడి పోటీకి దూరంగా ఉంటే ఇవేమి కలగవు.
అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేన(Janasena) పొత్తుపెట్టుకోవడంతో ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలకు నిరాశ ఎదురైంది.సీట్ల పంపకంలో భాగంగా కీలక నేతలు పోటీ చేయలేకపోయారు. కాని ఇప్పుడు వారికి ప్రత్యేక పదవులు వరించబోతున్నాయి. ఎన్నికల తలనొప్పి లేకుండానే షార్ట్ కట్ లో ఎమ్మెల్సీ, విప్, చీఫ్ విప్, మంత్రి పదవి, రాజ్యసభ సీటు వంటి ఛాన్సులు దక్కబోతున్నాయి. ఈ లిస్టులో టీడీపీ, జనసేనకు చెందిన నేతలు ఉన్నారు. టీడీపీ నుంచి దేవినేని ఉమా, ఎస్వీఎస్ఎన్ వర్మ,వంగవీటి రాధాతో పాటు మరికొందరు రేసులో ఉన్నారు.
పోటీ చేయకపోయినా కీలక పదవులు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరుతోంది. అయితే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో కచ్చితంగా ఆ పార్టీకే నష్టం కలుగుతుందని అందరూ భావించారు. అయితే వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారనే నమ్మకమో కాని ..ఊహించని విధంగా భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడం, సీట్లు పంచుకోవడంతో టీడీపీ, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులకు పోటీ చేసే అవకాశం చేజారిపోయింది. అయితే వారి స్థానంలో పోటీ చేసి గెలిచిన వాళ్లు ఎమ్మెల్యలుగా మారడంతో ఇప్పుడు తమ టికెట్ త్యాగం చేసిన వాళ్లకు టీడీపీ, జనసేన అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామని వాగ్ధానం చేసింది.
టికెట్ త్యాగం చేసిన వాళ్లకు పదవులు..
ఇందులో భాగంగానే ఇప్పుడు అలాంటి వాళ్లు పోటీ చేయకుండానే ప్రభుత్వంలో పదవులు చేపట్టే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. వాళ్లలో ముందు వరుసలో ఉన్నారు పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. గత ఎన్నికల్లో తన టికెట్ ను పవన్ కల్యాణ్ కు త్యాగం చేయడంతో ..ఇప్పుడు ఆయన్ని ఎమ్మెల్సీగా చేసే అవకాశం కనిపిస్తోంది.ఈయనతో పాటు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా పేరు కూడా లిస్టులో ఉంది. మైలవరం లేదా పెనమలూరు నియోజకవర్గం నుంచి ఉమా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలో చేరడం, పెనమలూరు టికెట్ కోసం బోడె ప్రసాద్ ఆందోళనకు దిగడంతో దేవినేని ఉమా పోటీ చేయలేదు.అందుకే టీడీపీ అధిష్టానం దేవినేనికి న్యాయం చేయాలనే ఆలోచనతో ఉందట.
వంగవీటి రాధాకు ఛాన్స్..
ఇక విజయవాడ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కూడా తన టికెట్ ను మొన్న జరిగిన ఎన్నికల్లో వదులుకున్నారు. పోటీ చేయకుండా కూటమికి మద్దతివ్వడంతో ..ఆయనకు ఉన్నతమైన పదవి కల్పిస్తామని స్వయంగా చంద్రబాబే హామీ ఇచ్చారు. వీళ్లే కాదు …ఇలాంటి చాలా మంది నాయకులకు టీడీపీ తరపు నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కల్యాణ్ హామీ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడు తమకు పదవులు వస్తాయా అని కీ లీడర్స్ ఎదురుచూస్తున్నారు.