యూపీఐ పేమెంట్స్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల ప్రక్రియ సులభతరం అయిపోయింది. నగదు చెల్లింపుల కంటే యూపీఐ పేమెంట్స్ ఎక్కువైపోయాయి. ట్రాన్సాక్షన్స్ కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా అంతా యూపీఐ పేమెంట్స్ కి అలవాటుపడిపోయారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్స్ యాప్స్ ను యూజ్ చేస్తున్నారు. అయితే దేశంలోని పౌరులకు యూపీఐ పేమెంట్స్ సౌకర్యం ఉంది. మరి విదేశాల్లోని ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటి? తాజాగా ప్రముఖ బ్యాంక్ ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై వారు అంతర్జాతీయ మొబైల్ నెంబర్స్ ద్వారా దేశంలో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.
ప్రవాస భారతీయులకు ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ అందించింది. దేశంలో వారు కూడా సులభంగా యూపీఐ చెల్లింపులు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ చెల్లింపుల ప్రక్రియను ఎన్ఆర్ఐలకోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. దీంతో ఎన్ఆర్ఐ వినియోగదారులు కూడా తమ అంతర్జాతీయ మొబైల్ నంబర్ల ద్వారా మన దేశంలో ఇన్ స్టంట్ పేమెంట్స్ చేయొచ్చని పేర్కొంది. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ సౌకర్యం లేదని బాధపడుతున్న యూజర్లకు ఐసీఐసీఐ ద్వారా యూపీఐ పేమెంట్స్ సులభతరం కానున్నాయి. యుటిలిటీ బిల్లులు, అలాగే ఇ-కామర్స్ లావాదేవీల కోసం భారతదేశంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉన్న వారి ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ బ్యాంక్ ఖాతాతో నమోదు చేసుకున్న వారి మొబైల్ నంబర్‌తో చెల్లింపులు చేయవచ్చని పేర్కొంది.
దీని కోసం బ్యాంక్ తన మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఐమొబైల్ పే ద్వారా ఈ సేవను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. యూఎస్ఏ, బ్రిటన్, యూఏఈ, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులకు మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ కస్టమర్‌లు ఇకపై యూపీఐ చెల్లింపులు చేయొచ్చు అని తెలిపింది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు లావాదేవీలను సులభతరం చేయడానికి, ఐసీఐసీఐ బ్యాంక్ ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంక్ యొక్క ఎన్ఆర్ కస్టమర్లు ఇప్పుడు యూపీఐ ద్వారా విద్యుత్, వాటర్, అద్దె వంటి చెల్లింపులను సులభంగా చేయొచ్చు.