AP Another Wicket out: ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న అధికారులపై వేటు పడుతోంది.. ఆ వ్యవహారం కంటిన్యూ అవుతోంది. తాజాగా ఈ జాబితాలోకి రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వంతైంది.
ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆయన్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లదారని హెచ్చరించింది కూడా. సచివాలయంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి పదవితోపాటు ఉద్యోగుల సమాఖ్యకు ఛైర్మన్‌గా ఉన్నారు.
ఎన్నికల కోడ్‌కు ముందు, కోడ్ తర్వాత అధికార పార్టీకి అనుకూలంగా వెంకటామిరెడ్డి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఉమ్మడి కడప జిల్లాలో మార్చి 31న బద్వేలు ఆర్టీసీ డిపోలో వైసీపీ తరపున ఆయన ప్రచారం చేశారు. మార్చి ఏడున చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అంతేకాదు వైసీపీకి అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మార్చి ఎనిమిదిన అనంతపురంలోని వార్డు సచివాలయ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన ప్రభుత్వం.. వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సచివాలయంలోని ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారు. ఈ క్రమంలో వెంకటరామిరెడ్డిపై వేటు వేయడం వైసీపీకి ఊహించని షాక్‌గా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.