ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. సహజ మరణం సంభవించేటప్పుడు మరణిస్తున్న వ్యక్తిని దగ్గర నుంచి చూడాల్సి రావడం చాలా వేదనాభరితంగా ఉంటుంది.
అయితే చనిపోతున్న వ్యక్తికి ఆ క్షణంలో ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? తన అంతం సమీపిస్తున్నప్పుడు అతనికి ఎలాంటి భావాలు కలుగుతాయి? శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో వివరిస్తున్నారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. మరణం దగ్గర పడుతున్న కొద్దీ వారు ఒక్కొక్కటిగా శరీరంలోని అవయవాల పనితీరును కోల్పోతూ ఉంటారు.
ముందుగా వారు ఆకలిని కోల్పోతారని, తర్వాత దాహాన్ని కోల్పోతారని చెబుతున్నారు పరిశోధకులు. చివరిగా పంచేంద్రియాలలో ఒకటైన వినికిడి శక్తిని కోల్పోతారు. తరువాత స్పర్శను కోల్పోతారు. అలా ఒక్కొక్క శక్తిని కోల్పోతూ మరణిస్తారు.
గుండెపోటు నుండి బయటపడిన వారిని పరిశోధకులు పలు ప్రశ్నలు వేసి వివరాలను సేకరించారు. గుండె పోటు రావడం అంటే మరణం అంచుల దాకా వెళ్లి రావడమే. ఆ సమయంలో వారికి తమ తలపై తెల్లటి కాంతిని చూసినట్లు చెప్పారు. అది కూడా స్పష్టమైన చిత్రాలతో మెరుస్తున్నట్టుగా కనిపించిందని ఈ పరిశోధనలో వారు వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు కోమాలోకి అంటే అపస్మారక స్థితిలోకి వెళుతూ ఉంటారు. ఆ స్థితిలో వారు ఎలా ఫీలవుతారో వైద్యులు వివరించారు. కోమా నుంచి బయటపడిన వారిని విచారింది వివరాలను సేకరించారు. కోమాలోకి వెళుతున్నప్పుడు రోగులు తమకు తుఫాను వచ్చినట్టుగా అనిపించిందని, అలలు అంతెత్తుకు ఎగిసిపడుతున్నట్టు అనిపించాయని వివరించారు. గందరగోళంగా అనిపించిందని అన్నారు.
చనిపోయే ముందు కూడా తెల్లటి కాంతి కనిపించడం ఎంతో మందికి అనుభవంలోకి వస్తుందని వివరిస్తున్నారు నిపుణులు. మెదడులో పెరుగుతున్న రసాయనాల వల్ల ఇది కలుగుతుందని, అలాగే మెదడులోని కొన్ని భాగాలు చనిపోవడం ప్రారంభిస్తాయని, అందుకే ఈ తెల్లని కాంతి కళ్ల ముందు ఉన్నట్టు కనిపిస్తుందని చెప్పారు.రోగులు తెల్లటి కాంతితో పాటు, లోయల్లోకి తొంగి చూస్తున్నట్టు అనుభూతి చెందుతారని వివరించారు.
యాక్సిడెంట్లు వంటి వాటిలో ఇన్ని మార్పులు జరగవు. వారికి వెంటనే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కానీ గుండెపోటు సహజమరణం వంటి వాటిలో మాత్రం చాలా మార్పులకు లోనయ్యాకే ఆ వ్యక్తి మరణిస్తాడు. పంచేంద్రియాల్లోని శక్తిని ఒక్కొక్కటిగా కోల్పోతాడు. ఆ తరువాతే వారికి మరణం సంభవిస్తుంది.
చనిపోవడానికి ముందు మనుషుల మెదడులో ఏం జరుగుతుందనే విషయంపై కూడా గతంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. చావుకు దగ్గరగా ఉన్న తొమ్మిది మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.మరణాన్ని ఆపేందుకు మెదడు కణాలు ప్రయత్నం చేస్తాయని పరిశోధకులు తెలిపారు. కానీ విఫలం అవుతాయి. మరణం సంభవించిన తరువాత ఓ పదినిమిషాల వరకు మెదడుకు రక్త సరఫరా అవుతుంది. ఆ తరువాత మెదడు కణాలు పూర్తిగా మరణిస్తాయి.