227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ షోకాజ్‌ నోటీసులు

నాడు-నేడు ప్రధానోపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు


అనకాపల్లి జిల్లా పరిధిలో రెండో దశ నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లోని 227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా పరిధిలో రెండో దశ నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లోని 227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. విద్యాశాఖ రాష్ట్ర పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన విభాగం కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆయా పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనుల పురోగతి శాతం తక్కువగా ఉన్న 227 మందికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో జరుగుతున్న మరుగుదొడ్లు, వంట గదులు, మేజర్‌, మైనర్‌ మరమ్మతులు, తరగతి గదులు, విద్యుత్తు పనుల ప్రగతిలో వీరు వెనకబడిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల్లో ఇందుకు తగిన వివరణను అందజేయాలని ఆమె ఉత్తర్వుల్లో కోరారు. ఈ వివరణలను కమిషనర్‌కు పంపిస్తామని, వివరణ ఇవ్వని ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.