EMI | హోంలోన్‌ ఈఎంఐ తగ్గాలంటే ఇలా చేయండి..

www.mannamweb.com


రిజర్వ్‌ బ్యాంక్‌ సంవత్సరంన్నర క్రితం నుంచి మొదలుపెట్టి వరుస వడ్డీ రేట్ల పెంపుతో గృహ రుణాలపై నెలసరి వాయిదాల చెల్లింపు పెనుభారంగా మారింది. రెండేండ్ల క్రితం చెల్లించిన ఈఎంఐలకు ఇప్పుడు అదనంగా 20 శాతం చెల్లించాల్సి వస్తున్నది.
ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ 2.5 శాతం మేర రేట్ల భారం మోపిన తర్వాత పెంపులకు బ్రేక్‌వేసిన ఆర్బీఐ తాజా సమీక్షలోనూ వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టింది. క్రమేపీ ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో 2024 మార్చి లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లకు కోతపెడితే భారత్‌లోనూ ఏప్రిల్‌లో తగ్గుతాయని, ఫెడ్‌ జాప్యం చేస్తే ఇక్కడ మరింత ఆలస్యం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంమీద వచ్చే ఏడాది ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు బలంగా ఉన్నాయి. కానీ…రిజర్వ్‌బ్యాంక్‌ తగ్గించినంత మాత్రాన గృహ రుణ వినియోగదారులందరికీ ఈఎంఐలూ వెంటనే తగ్గవు. గృహ రుణాల్ని బ్యాంకులు వివిధ రేట్లకు అనుసంధానించి ఇస్తుంటాయి. ఈబీఎల్‌ఆర్‌ (ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ లింక్డ్‌ లెండింగ్‌ రేట్‌), ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ లింక్డ్‌ లెండింగ్‌ రేట్‌), బేస్‌ రేట్‌ లింక్‌ అయ్యి రుణాలు మంజూరవుతాయి.

భారం తగ్గించే రేటు ఇదే..
ఆర్బీఐ రెపో రేటుకు కోతపెడితే ఈబీఎల్‌ఆర్‌తో లింక్‌ చేసి మంజూరైన గృహ రుణాలపై వడ్డీ రేటునే బ్యాంక్‌లు వెనువెంటనే తగ్గిస్తాయి. ఈ రుణాలు తీసుకున్నవారికి తక్షణ ఊరట లభిస్తుంది. రెపో రేటు ఎంత తగ్గిస్తే ఆ మేరకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. ఈ నేపథ్యంలో మీరు తీసుకున్న రుణం ఈబీఎల్‌ఆర్‌తో లింక్‌ చేసిందో కాదో తెలుసుకోండి. లేకపోతే మీ గృహ రుణాన్ని ఈబీఎల్‌ఆర్‌కు మార్పు చేయమంటూ బ్యాంక్‌ను కోరండి. నామమాత్రపు ఫీజుతో బ్యాంక్‌ షిప్ట్‌కు అనుమతిస్తుంది. ఉదాహరణకు ఒన్‌టైమ్‌ స్విచోవర్‌కు ఎస్బీఐ రూ.1,000 చార్జీ వసూలు చేస్తుంది. దీనికి పన్నులు అదనం.

ఎన్‌బీఎఫ్‌సీ రుణం అయితే
మీరు నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి గృహ రుణాన్ని తీసుకున్నట్లయితే మాత్రం రేటు మార్పిడి కుదరదు. ఆర్బీఐ రేట్లు తగ్గించిన తర్వాత కొత్తగా తీసుకునేవారికి రేట్లను తగ్గించి ఇస్తూ, మీ ఈఎంఐలు తగ్గించకపోతే గృహ రుణాన్ని బదిలీ చేసుకోవడం ఉత్తమం. కొత్త రుణాలకు, మీ రుణానికి రేటు వ్యత్యాసం 0.5 శాతం లేదా అంతకు మించి ఉంటే మీ గృహ రుణాన్ని మరో రుణదాతకు బదిలీ చేసుకోండి. అయితే బదిలీకి అయ్యే వ్యయాన్ని, ఒనగూడే ప్రయోజనాన్ని మీరు చూసుకోవాలి. పలు బ్యాంక్‌లు ప్రాసెసింగ్‌ ఫీజు రద్దుతో సహా వివిధ చార్జీలపై డిస్కౌంట్లు ఇస్తుంటాయి. మీ బదిలీ వ్యయాన్ని మరింత తగ్గించే బ్యాంక్‌ కోసం అన్వేషించండి.

ఓవర్‌బాట్‌ జోన్‌లో మార్కెట్‌

వరుసగా రెండోవారమూ బలమైన ర్యాలీ జరిపిన నిఫ్టీ మరో 701 పాయింట్లు లాభపడి 20,969 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు వారాల్లో 1,179 పాయింట్లు పెరిగింది. వేగవంతమైన ర్యాలీ కారణంగా మార్కెట్‌ ఓవర్‌బాట్‌ జోన్‌లో పడిందని, ఇలాంటి స్థితిలో కరెక్షన్‌ జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయని జేఎం ఫైనాన్షియల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ సోనీ పట్నాయక్‌ తెలిపారు. అయితే కరెక్షన్‌ సంకేతాలు అందేవరకూ ఇన్వెస్టర్లు అప్‌సైడ్‌ మూమెంటంలో పాలుపంచుకోవచ్చని చెప్పారు. మార్కెట్‌ భారీగా పెరిగినందున, ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలని, రక్షణాత్మక రంగాలకు చెందిన ఎంపికచేసిన షేర్లను మాత్రమే కొనుగోలు చేయాలంటూ ఈక్విటీరీసెర్చ్‌. ఆసియా వ్యవస్థాపకుడు మిలన్‌ వైష్ణవ్‌ సూచించారు. నిఫ్టీ వీక్లీ చార్టులు అప్‌ట్రెండ్‌నే సూచిస్తున్నాయని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమిత్‌ మోది చెప్పారు.

కీలక స్థాయి 21,000
ఈ వారం నిఫ్టీకి 21,000 పాయింట్ల స్థాయి కీలకమైనదని, ఆ స్థాయి వద్ద సూచి వ్యవహరించే తీరుపై తదుపరి ట్రెండ్‌ ఆధారపడి ఉంటుందని మిలన్‌ వైష్ణవ్‌ విశ్లేషించారు. ఈ స్థాయిని దాటి, పైన నిలదొక్కుకుంటే మరికొంత పెరిగే అవకాశం ఉంటుందని, లేకపోతే పరిమిత శ్రేణిలో కన్సాలిడేషన్‌ జరుగుతుందని తెలిపారు. నిఫ్టీకి 21,000పైన తదుపరి అవరోధం 21,265 పాయింట్ల వద్ద ఏర్పడవచ్చని, 20,700, 20,580 స్థాయిలు మద్దతుగా నిలుస్తాయని అంచనా వేశారు. 20,800 పాయింట్ల స్థాయిని బ్రేక్‌చేస్తేనే స్వల్పకాలిక కరెక్షన్‌ జరగవచ్చని, అప్పటివరకూ ర్యాలీ కొనసాగుతుందని సోనీ పట్నాయక్‌ వివరించారు. వీక్లీ చార్టుల ప్రకారం 20,500 మద్దతుస్థాయి కీలకమైనదని, ఈ స్థాయిపైన ఉన్నంతవరకూ అప్‌ట్రెండ్‌కు ప్రమాదమేదీ లేదని జిమిత్‌ మోది తెలిపారు. ఐటీ, రియల్టీ, బ్యాంకింగ్‌ రంగాల సూచీలు పటిష్ఠంగా ఉన్నాయన్నారు.