బైక్ మైలేజ్ ఇవ్వడం లేదా? వారానికి ఒకసారి ఇలా చేయండి – స్పీడ్, మైలేజ్ రెండు పెరుగుతాయి!
How to Improve Bike Mileage: మీకు బైక్ ఉందా..? అది మంచి మైలేజ్ ఇవ్వడం లేదని వాపోతున్నారా..? నో టెన్షన్. ఈ చిన్న టిప్స్ పాటిస్తే.. మంచి మైలేజ్‌తో పాటు సూపర్ స్పీడ్ కూడా గ్యారెంటీ..!
How to Improve Bike Mileage with Simple Tips: బైక్ కొన్న కొత్తలో బాగానే ఉంటుంది. కానీ.. కొన్నాళ్ల తర్వాత మైలేజ్ సమస్య మొదలవుతుంది. లీటరుకు కనీసం 40 కిలోమీటర్లు కూడా రావడం లేదని చాలా మంది వాపోతుంటారు. మరి.. ఈ మైలేజ్ సమస్యను అరికట్టడమెలా? మైలేజ్ పెంచేందుకు ఏం చేయాలి? ఏమైనా పరిష్కార మార్గాలున్నాయా? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.
How to Clean Bike Chain in Telugu: చాలా మంది బైక్‌ను ఇష్టం వచ్చినట్లు నడుపుతుంటారు. బైక్ క్లీనింగ్ విషయంలో కూడా శ్రద్ధ చూపించరు. అవసరం ఉన్నప్పుడు వాడి.. తర్వాత పక్కన పెడతారు. దీనివల్ల మైలేజ్ సమస్య వస్తుంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడి.. బండి పర్ఫెక్ట్ మైలేజ్ ఇవ్వాలంటే బైక్‌ను జాగ్రత్తగా చూసుకోవడంతోపాటు.. బైక్ చైన్‌ను వారానికి ఒకసారి క్లీన్ చేయాలని ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల బండి మంచి మైలేజ్ ఇవ్వడంతోపాటు ఇంధనం అవసరం కూడా తగ్గుతుందని అంటున్నారు.
బైక్ చైన్ ఎలా క్లీన్ చేయాలంటే..?
ఇంట్లో బైక్ చైన్‌ను శుభ్రం చేయడానికి ముందుగా బ్రష్, చైన్ క్లీనింగ్ సొల్యూషన్, క్లాత్, చైన్ ఆయిల్ సిద్ధం చేసుకోవాలి.
తర్వాత బైక్‌ను డబుల్ స్టాండ్ మీద నిలబెట్టాలి.
శుభ్రపరిచే ముందు చైన్‌ను చెక్ చేయాలి.
చైన్ వదులుగా ఉందా? లింక్‌లు గట్టిగా ఉన్నాయా? తుప్పు పట్టిందా? అనేది చూడాలి.
వీటన్నింటినీ తనిఖీ చేసిన తర్వాత.. చైన్ క్లీనర్ ఉపయోగించి బ్రష్‌తో రుద్దాలి.
చైన్ ఒక వైపు మాత్రమే కాకుండా రెండు వైపులా శుభ్రం చేయాలి.
సరిగ్గా క్లీన్ చేసిన తర్వాత లైట్ ప్రెజర్ వాటర్ పైపుతో లేదా బకెట్‌లో నీటిని తీసుకొని చైన్‌ను సరిగ్గా శుభ్రం చేసిన తర్వాత శుభ్రమైన క్లాత్‌తో పూర్తిగా తుడవండి.
చైన్ పూర్తిగా ఆరిపోయాక దానిపై నాణ్యమైన లూబ్రికెంట్ ఆయిల్‌ను అప్లై చేయండి.
టైర్‌ను నెమ్మదిగా తిప్పుతూ అప్లై చేయడం వల్ల మొత్తం చైన్‌కు ఆయిల్ పడుతుంది.
లూబ్రికెంట్ అప్లై చేసిన తర్వాత కొంత సేపు అలాగే వదిలేయాలి.
దీనివల్ల టైర్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా తిరుగుతాయి. బైక్ స్పీడ్, మైలేజీ రెండు పెరుగుతాయి.
అయితే బైక్‌ను ఇంట్లో క్లీన్ చేసుకోలేని వారు సర్వీసింగ్‌కు ఇస్తుంటారు. బండి సర్వీసింగ్ చేయించే సమయంలో కొన్ని విషయాలు గమనించుకోవాలి. ఎందుకంటే.. బండిని సర్వీసింగ్‌కు ఇచ్చినప్పుడు చాలా మంది మెకానిక్‌లు చేసే తప్పు.. బైక్ సర్వీసింగ్ అయిపోయిన వెంటనే గొలుసుపై ఆయిల్ వేయడం. ఇది చాలా తప్పు. చైన్ నుంచి నీరు పూర్తిగా తొలగించిన తర్వాత క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత.. తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే దానిపై ఆయిల్ వేయాలి. దీంతో బైక్ స్పీడ్, మైలేజ్ రెండు పెరుగుతాయి.