తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… వైకుంఠ ఏకాదశి దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపింది. అలాగే ఈ దర్శనాలలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేయనున్నట్టుగా చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనాలపై నిర్ణయం తీసుకున్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివరాలు వెల్లడించారు.
డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టుగా తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని వెల్లడించారు.
వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి మొదటి మూడు రోజులు ఆన్‌లైన్‌లో ఈ డిప్ ద్వారా టోకెన్లు పొందినవారికి మాత్రమే దర్శనం కల్పించనున్నట్టుగా తెలిపారు. ఇందుకోసం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు వైకుంఠద్వార దర్శన టోకెన్లకు ఈ-డిప్‌లో రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలిపారు. డిసెంబర్ 2వ తేదీన డిప్ ద్వారా టోకెన్లు జారీ చేయనున్నట్టుగా చెప్పారు. అయితే 4వ రోజు నుంచి యాథావిథిగా సర్వదర్శనానికి అనుమతించనున్నట్టుగా తెలిపారు.































