100 Crores Scam: రోజా అరెస్ట్ తప్పదా? ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిందెవరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాగా.. వైసీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫలితాలు వెలువడిన నాటి నుంచి కొందరు వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడటంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.


కొన్ని చోట్ల వైఎస్సార్ విగ్రహాలను కూల్చేసి వాటి స్థానంలో ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులకు దిగుతోందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమలో కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని కూటమి నేతలు ఎన్నికల ప్రచారం ఆరోపించారు. భూ కబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, మైనింగ్, మద్యం, రేషన్ బియ్యం, డ్రగ్స్ రవాణా ఇలా అన్ని రంగాల్లో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు సంపాదించారని వారు విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని , అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత సైతం ఇదే రకమైన హెచ్చరికలు చేశారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య కేసును రీఓపెన్ చేయిస్తామని తెలిపారు. అలాగే టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై సమీక్ష చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు.

ఏపీలో మారిన పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ లిస్ట్‌లో ఫస్ట్ పేరు రోజాదేననే టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా.. సీఎం జగన్‌పై ఈగ వాలనిచ్చేవారు కాదు రోజా. పదునైన మాటలతో ప్రత్యర్ధులు సైతం సైలెంట్ అవ్వాల్సిందే. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. తర్వాత మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణలో మంత్రి పదవిని కొట్టేశారు. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రోజా ఓ వెలుగు వెలిగారు. వేదికలపై డ్యాన్సులు, పిల్లలతో కలిసి ఆటలు ఆడుతూ నిత్యం వార్తల్లో నిలిచేవారు.

జగన్ కేబినెట్‌లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం – ఆంధ్ర, సీఎం కప్‌ల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లు స్కాం జరిగిందని.. రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. ఈ మేరకు సీఐడీకి ఆత్యా – పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కాంపై సీఐడీకి సైతం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

క్రీడా శాఖ మంత్రిగా రోజా ఉన్నప్పుడు.. క్రీడా పరికరాల కొనుగోలులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆడుదాం ఆంధ్ర పోటీల్లో నాసిరకపు క్రీడా కిట్లను ఎక్కువ ధరలకు కొనుగోలు చేశారంటూ ఆరోపిస్తున్నారు. క్రీడాకారుల కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందినవారిపై విచారణ జరపాలని నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా స్పందించారు.

మంచి చేసి ఓడిపోయాం.. తలెత్తుకుని తిరుగుదామంటూ రోజా ట్వీట్ చేశారు. ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్‌ కార్యక్రమాలకు సంబంధించిన దస్త్రాలన్నీ సీజ్ చేయాలని.. అలాగే జగన్ ప్రభుత్వ హయాంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో జరిగిన అవకతవకలను కూడా పరిశీలించాలని క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రోజా అరెస్ట్ ఖాయమనే కథనాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

కౌంటింగ్ మొదలు నేటి వరకు బయటకు కనిపించని రోజా మచ్చుకైనా కనిపించని నేపథ్యంలో తాజా ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో విపక్షనేతలపై నోటి దురుసు ప్రదర్శించిన నేతల్లో రోజా ఒకరు. తాము అధికారంలోకి వస్తే ఆమెను వదిలిపెట్టేది లేదని అప్పట్లోనే పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే హెచ్చరించేవారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కాం బయటకు రావడం దీనిలో భాగమనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరి రోజాను అరెస్ట్ చేస్తారా, లేదా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.