1000 ఏళ్ల చోళ రాజధాని

భారతీయ బాబిలోనియన్‌గా పేర్కొన్న చరిత్రకారులునేటి నుంచి 5 రోజుల పాటు వేడుకలు


గంగైకొండ చోళపురంలో బృహదీశ్వర ఆలయాన్ని తలపించే శివాలయం

చోళ సామ్రాజ్యం..

ప్రాచీన భారతదేశంలోని గొప్ప సామ్రాజ్యాల్లో ఒకటి.. దీని రాజధాని గంగైకొండ చోళపురం. తమిళనాడులోని అరియలూరు జిల్లాలో కొల్లిడం నదీ తీరాన ఉంది. ఈ నగరాన్ని భారతీయ బాబిలోనియన్‌గా చరిత్రకారులు ప్రస్తావిస్తారు. క్రీ.శ. 1025లో రాజేంద్ర చోళరాజు-1 నిర్మించిన ఈ నగరానికి ఇప్పుడు వెయ్యేళ్లు. ఈ సందర్భంగా అక్కడ ఈ నెల 23 నుంచి 27 వరకు ప్రత్యేక వేడుకల్ని నిర్వహించనున్నారు. వాటిలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 27న ఈ పురాతన రాజధానికి రానున్నట్లు గంగైకొండ చోళపురం అభివృద్ధి మండలి ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు. వాస్తవానికి చోళుల రాజధాని తంజావూరు. రాజరాజ చోళుడు-1 (పరిపాలనా కాలం క్రీశ 985-1014) తర్వాత ఆయన కుమారుడు రాజేంద్ర చోళరాజు-1 (క్రీశ 1014-1044) సామ్రాజ్యాన్ని విస్తరించాలని భావించారు. భారీఎత్తున సైన్యాన్ని నియమించుకొని తంజావూరుకు 50 కిలోమీటర్ల దూరంలోని గంగైకొండ చోళపురంలో శిక్షణ ఇచ్చారు. తర్వాత ఉత్తరాది ప్రాంతాలపై దండయాత్రకు సిద్ధమయ్యారు. మార్గంలోని కళింగ, పాల సామ్రాజ్యాలను ఓడించారు. ఓడిన రాజులతో గంగాజలాలను మోయించి తెచ్చి గంగైకొండ చోళపురంలోని ‘చోళ గంగం’ చెరువులో కలిపారని చెబుతారు. ఈ విజయానికి గుర్తుగా రాజేంద్ర చోళరాజు-1 అదే ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారు. తంజావూరులో తన తండ్రి హయాంలో నిర్మించిన బృహదీశ్వర ఆలయాన్ని పోలిన మరో శివాలయాన్ని, కోటను ఇక్కడ నిర్మించారు. వాటి నిర్మాణాల్లో గంగాజలాల్ని వాడినట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని చోళరాజులు 256 ఏళ్లపాటు తుంగభద్ర నుంచి ఆంధ్రా సహా దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాలను పాలించారు. 11-12 శతాబ్దాల్లో గంగైకొండ చోళపురం గొప్ప రాజధానిగా ఎదిగింది. రాజకీయంగా, వాణిజ్యపరంగా, సాంస్కృతికపరంగా పేరుగాంచింది.

  • 13వ శతాబ్దంలో పాండ్యరాజుల ప్రాబల్యంతో చోళసామ్రాజ్యానికి ముగింపు పడింది.
  • గంగైకొండ చోళపురం చరిత్ర, విశిష్టతలను గుర్తించిన యునెస్కో ఈ ప్రాంతాన్ని వారసత్వ సంపదగా ప్రకటించి పరిరక్షిస్తోంది.
  • ఆనాటి ఆనవాళ్లలో ఆలయం ఒకటే మిగిలింది. ఈ ప్రాంగణంలోనే వెయ్యేళ్ల వేడుక నిర్వహించనున్నారు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.