Students: గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు

Students: గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు


ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తారు.

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తారు. అయితే, బదిలీపై వెళ్లిన ఓ ఉపాధ్యాయుడితోపాటే పదుల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల మారిన అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జన్నారం మండలం పొనకల్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా జాజాల శ్రీనివాస్‌ 2012 జులై 13న చేరారు. అప్పుడు అక్కడ ఐదు తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 32 మంది విద్యార్థులు ఉండేవారు. ఆయన పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో పాఠాలు బోధించడం, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా 250కి చేరింది.ఆయన ఈ నెల 1న ఇదే మండలంలో మూడు కి.మీ. దూరంలోని అక్కపెల్లిగూడ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ పరిణామాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమకెంతో ఇష్టమైన మాస్టారున్న పాఠశాలలోనే చేరతామంటూ పిల్లలు గొడవ చేయడంతో 2, 3 తేదీల్లో ఏకంగా 133 మందిని వారి తల్లిదండ్రులు అక్కపెల్లిగూడ బడిలో చేర్పించారు.  దాంతో జూన్‌ 30న కేవలం 21 మంది విద్యార్థులున్న అక్కపెల్లిగూడ పాఠశాల ఇప్పుడు 154 మందితో కళకళలాడుతోంది.  ఈ పాఠశాలలో జాజాల శ్రీనివాస్‌తోపాటు మరో ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు.