పేదలకు మూడు పూటలా అన్నం పెట్టి ఆదుకునే అన్న క్యాంటీన్లను వచ్చే నెలలో పునః ప్రారంభించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు క్యాంటీన్లను ఓపెన్ చేసే విషయాన్ని ఏపీ సర్కార్ పరిశీలిస్తోంది.
తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏపీలో 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు 15కి పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు చంద్రబాబు సర్కార్ నడుం బిగించింది. రూ.20 కోట్లతో అన్న క్యాంటీన్లకు మరమ్మతులు చేస్తున్నారు. క్యాంటీన్లలో ఐవోటీ డివైజ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ల కోసం రూ.7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 20 క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం మరో రూ. 65 కోట్లను కూడా విడుదల చేశారు.
అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం కోసం కార్మికులు, రిక్షావాలాలు, ఆటో డ్రైవర్లు, ఆసుపత్రుల వద్ద పేషెంట్లు, బస్టాండ్ల వద్ద ప్రయాణీకులు.. ఇలా అనేక మంది ఎదురు చూస్తున్నారు. పూట గడవక.. చాలీచాలని తిండి తిని జీవనం సాగిస్తున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుళ్లుగోపురాల్లో, బయట ఏర్పాటు చేసే నిత్యాన్నదానాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొని కడుపు నింపుకుంటున్నామన్నారు. అన్న క్యాంటీన్ల ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు నిరుపేదలు. 5 రూపాయలకే కడుపు నిండా మూడు పూటలా టిఫిన్, భోజనం పెట్టే అన్న క్యాంటీన్ల ఓపెనింగ్ కోసం పేదలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.