ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతున్నది. అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలను తీరుస్తుండడంతో క్రెడిట్ కార్డులకు క్రేజ్ పెరిగింది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటున్నాడు. బ్యాంకులు సైతం శాలరీలతో సంబంధం లేకుండా రకరకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులను ఇచ్చేస్తున్నాయి. చాలా మంది క్రెడిట్ కార్డుల ద్వారానే పలు రకాల బిల్లులు చెల్లిస్తుంటారు. హోటల్స్, ఆన్ లైన్ షాపింగ్, ఇంకా ఇతర బిల్లులను క్రెడిట్ కార్డులను యూజ్ చేసి పేమెంట్ చేస్తుంటారు.
అయితే షాపుల్లో క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లు పే చేసినప్పుడు 2 శాతం ఎక్కువగా వసూలు చేస్తుంటారు వ్యాపరస్తులు. దీంతో కార్డుదారులకు అదనపు భారం పడుతుంటుంది. మీరు ఆర్బీఐ రూల్స్ తెలుసుకున్నట్లైతే 2 శాతం అదనపు ఛార్జీలకు నో చెప్పొచ్చు. కానీ, ఈ విషయం తెలియక క్రెడిట్ కార్డుదారులు షాపుల్లో 2 శాతం అదనపు ఛార్జీలను చెల్లిస్తుంటారు. ఇకపై మీరు షాపింగ్ చేసినప్పుడు క్రెడిట్ కార్డుతో బిల్ పే చేస్తే ఆర్బీఐ రూల్ చెప్పి లావాదేవీపై 2% అదనపు ఛార్జీ నుంచి తప్పించుకోవచ్చు.
రెస్టారెంట్‌లో బిల్లును చెల్లించినప్పుడు లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా బిల్లు పే చేసినప్పుడు స్వైప్ ఛార్జ్ విధిస్తారు. దీనినే ఇంటర్‌చేంజ్ ఫీజు అని కూడా అంటారు. ఈ ఛార్జీలు సాధారణంగా కార్డ్ నెట్‌వర్క్ ద్వారా నిర్ణయిస్తారు. మీరు మీ క్రెడిట్ కార్డ్‌ని ఏదైనా POS లేదా పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్‌లో స్వైప్ చేసినప్పుడు, వ్యాపారి POS టెర్మినల్ మీ కార్డ్ వివరాలను చదివి, చెల్లింపు గేట్‌వే ప్రాసెసర్ ద్వారా క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌కు ఫార్వార్డ్ చేస్తుంది. కార్డును జారీ చేసిన బ్యాంక్ లావాదేవీని ధృవీకరిస్తుంది. తర్వాత, దానిని నెట్‌వర్క్ ద్వారా అంగీకరిస్తుంది లేదా రిజెక్ట్ చేస్తుంది. కార్డ్ ఉపయోగించి ఏదైనా వస్తువును కొన్నప్పుడు ఆ లావాదేవీ విలువలో దాదాపు 2% స్వైప్ ఛార్జీ ఉంటుంది.
దాహరణకు మీరు ఒక మొబైల్ షాప్ కు వెళ్లి ఫోన్ కొన్నారనుకుందాం. ఆ ఫోన్ విలువ రూ. 20 వేలు. క్రెడిట్ కార్డును ఉపయోగించి బిల్లు చెల్లించినప్పుడు ఆ షాప్ యజమాని 2 శాతం అదనంగా చెలించాలని కోరుతాడు. అంటే 20 వేలపై 2 శాతం అంటే రూ. 400 ఎక్స్ ట్రా చెల్లించమని కోరుతాడు. అప్పుడు మీరు నేనెందుకు పే చేయాలని షాప్ కీపర్ ను ప్రశ్నించొచ్చు. దీనికి సమాధానంగా షాప్ యజమాని ఇది నాకోసం కాదు పీఓఎస్ మెషిన్ కోసం ఈ బిల్లు కస్టమరే చెల్లించాలని చెబుతాడు. అన్ని షాపుల వాళ్లు ఇలాగే వసూలు చేస్తున్నారంటూ చెప్తాడు. అప్పుడు మీకు ఆర్బీఐ రూల్ గురించి తెలిసినట్లైతే అదనపు చార్జీ నుంచి బయటపడొచ్చు. ఆర్బీఐ రూల్ ప్రకారం 2 శాతం పీఓఎస్ ఛార్జ్ మర్చంట్ పేచేయాలి. కస్టమర్లు చెల్లించాల్సిన పనిలేదు. కాబట్టి మీరు క్రెడిట్ కార్డు ద్వారా చేసే ట్రాన్సాక్షన్ పై 2 శాతం అదనపు ఛార్జీని చెల్లించాల్సిన పనిలేదు.