భారత్‌కు జాక్‌పాట్ తగిలింది. ఒడిశాలోని బహుళ జిల్లాల్లో బంగారు నిల్వలు గుర్తించారు. దీంతో ఒడిశా త్వరలోనే బంగారు తవ్వకాలకు కొత్త కేంద్రంగా అవతరించనుందనే మాట వినిపిస్తుంది.
వివరాలు… ఇటీవలి ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులో భాగంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిశాలోని బహుళ జిల్లాల్లో బంగారు నిల్వలను గుర్తించింది. దేవ్‌ఘర్ (అదాస-రాంపల్లి), సుందర్‌గఢ్, నబరంగ్‌పూర్, కియోంఝర్, అంగుల్, కోరాపుట్‌లలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టుగా నిర్దారణ అయింది. మయూర్‌భంజ్, మల్కన్‌గిరి, సంబల్‌పూర్, బౌధ్‌లలో కూడా ఖనిజాలకు సంబంధించిన అన్వేషణ పనులు జరుగుతున్నాయి.
ఈ ఏడాది మార్చిలో ఒడిశాలో బంగారు నిల్వల గురించి ఆ రాష్ట్ర శాసనసభలో గనుల శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా మాట్లాడారు. సుందర్‌గఢ్, నబరంగ్‌పూర్, అంగుల్, కోరాపుట్‌లలో గణనీయమైన బంగారు నిక్షేపాలు గుర్తించబడ్డాయని ఆయన అసెంబ్లీలో వెల్లడించారు.
ఈ పరిణామాలతో ఇప్పుడు గుర్తించిన బంగారాన్ని ఎలా వెలికితీస్తారు?, వేలం ఏ విధంగా ఉండనుందనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అందబాటులో ఉన్న సమాచారం గురించి తెలుసుకుందాం…
బంగారం నిక్షేపాలు ఎంతమేర ఉన్నాయనే అధికారిక గణంకాలు ఇంకా విడుదల కాలేదు. అయితే భౌగోళిక సూచికల ఆధారంగా బంగారం నిల్వలు 10 నుండి 20 మెట్రిక్ టన్నుల మధ్య ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది భారీ మొత్తం అయినప్పటికీ… భారత్ దిగుమతి చేసుకుంటున్న పరిమాణంతో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకంటే… గత సంవత్సరంలో భారతదేశం దాదాపు 700-800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అయితే ఒడిశాలో బంగారం వెలికితీత అనేది భారత ఆర్థిక వ్యవస్థపై భారీగా సానుకూల ప్రభావం చూపకపోయినప్పటికీ… దేశీయంగా బంగారం వెలికితీతకు సరికొత్త తలుపులు తెరుస్తుంది.
బంగారు నిల్వల నిర్దారణ కావడంతో ఒడిశా ప్రభుత్వం ప్రస్తుతం ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసీ), జీఎస్‌ఐలతో కలిసి ఈ అన్వేషణలను వాణిజ్యీకరించడానికి వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. దేవ్‌ఘర్‌లోని మొదటి బంగారు మైనింగ్ బ్లాక్‌ను వేలం వేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. మరోవైపు నిల్వలను ధ్రువీకరించడానికి జీఎస్‌ఐ… అడసా-రాంపల్లి, గోపూర్-గాజిపూర్ వంటి ప్రాంతాలలో G3 (ప్రారంభ నిఘా) నుంచి G2 స్థాయికి (వివరణాత్మక నమూనా, డ్రిల్లింగ్) తన అన్వేషణను ముందుకు తీసుకువెళుతోంది.
అయితే ఖనిజం గ్రేడ్, వెలికితీతను నిర్ణయించడానికి అన్వేషణ, ల్యాబోరేటరీ విశ్లేషణ ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు. వాణిజ్య సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎండీఎంఆర్ చట్టం మార్గదర్శకాల ప్రకారం పారదర్శక మైనింగ్ బ్లాక్ వేలం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే మైనింగ్‌కు పర్యావరణ అనుమతులు చాలా కీలకమైనవి.
ఇక, అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ బంగారు నిక్షేపాలు ప్రాంతీయ అభివృద్ధిని ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నాయి. స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పన, మైనింగ్, రవాణా వంటి సేవలు పెరగొచ్చు.



































