Germany: గిఫ్ట్‌గా 20,000 ఏనుగులను పంపమంటారా: జర్మనీని హెచ్చరించిన బోట్సువానా

www.mannamweb.com


జర్మనీ (Germany) ముచ్చటపడితే 20,000 ఏనుగులను గిఫ్ట్‌గా ఇస్తామని బోట్సువానా (Botswana) అధ్యక్షుడు మసిసి హెచ్చరించారు. ఈ ఏడాది ప్రారంభంలో జర్మనీ పర్యావరణ మంత్రిత్వ శాఖ హంటింగ్‌ ట్రోఫీలపై కఠిన ఆంక్షలు విధించే అంశాన్ని ప్రతిపాదించింది. వన్యప్రాణుల వేటను తగ్గించడానికి ఈ చర్య చేపట్టింది. దీనిపై బోట్సువానా అధ్యక్షుడు మండిపడ్డారు. ఆ చర్య తమ దేశాన్ని మరింత పేదరికంలోకి నెడుతుందన్నారు. అంతేకాదు.. తమ దేశంలో ఏనుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడానికి కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి సంతతిని అదుపులో ఉంచడానికి వేట తప్పనిసరి అని మసిసి పేర్కొన్నారు. అవి జనావాసాలపైకి వచ్చి పంటలను ధ్వంసం చేయడం, ఇళ్లను కూల్చివేయడం చేస్తున్నాయని తెలిపారు. ‘‘బోట్సువానా సమస్యల గురించి బెర్లిన్‌లో కూర్చొని చెప్పడం చాలా తేలిక. ప్రపంచం కోసం ఆ జంతువులను కాపాడి మేం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. మాకు చెప్పినట్లే మీరు కూడా జంతువులతో కలిసి జీవించండి. ఇది జోక్‌ కాదు’’ అని వ్యాఖ్యానించారు.

బోట్సువానాలో 1,30,000 ఏనుగులు ఉన్నాయి. ప్రపంచంలోనే ఇవి అత్యధికంగా జీవిస్తున్న తొలి మూడు దేశాల్లో ఇది కూడా ఒకటి. 2014లో వీటి వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కానీ, స్థానికులు తీవ్రమైన ఒత్తిడి చేయడంతో 2019లో తొలగించింది. ఇప్పుడు వార్షిక వేట కోటాను ప్రభుత్వం నిర్ణయించి అనుమతులు జారీ చేస్తోంది. స్థానికులకు అది ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇప్పటికే అంగోలాకు 8,000, మోజాంబిక్‌కు 5,000 ఏనుగులను ఇచ్చింది.

ఈ ఏడాది మార్చిలో 10,000 ఏనుగులను పంపిస్తామని లండన్‌ను బోట్సువానా అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు అలాంటి గిఫ్టే జర్మనీకి కూడా ఇస్తామని ఆ దేశాధ్యక్షుడు పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్యలో హంటింగ్‌ ట్రోఫీలను అత్యధికంగా ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశం జర్మనీ. ఇక ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, బెల్జియం దేశాలు వీటిపై పూర్తిగా నిషేధం విధించాయి. మరోవైపు మిసిసి వ్యాఖ్యలపై జర్మనీ ప్రతినిధి మాట్లాడుతూ బోట్సువానా తమ వద్ద ఎలాంటి ఆందోళనా వ్యక్తం చేయలేదని తెలిపారు.