ఏపీలో( Andhra Pradesh) డీఎస్సీ నియామకాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. దాదాపు ఉద్యోగాలు పొందిన వారికి మాత్రమే ధ్రువపత్రాలను పరిశీలించారు.
అయితే తుది జాబితా ఫైనల్ అని అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం వీలైనంత త్వరగా తుది జాబితాను ప్రకటించి.. ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. తుది జాబితాను ఈ నెల 15న విడుదల చేసి.. 19న అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి.. దసరా సెలవుల్లో శిక్షణ ఇచ్చి.. సెలవులు అనంతరం పాఠశాలలు తెరిచే సమయానికి వారు విధుల్లో చేరేలా ప్లాన్ చేస్తోంది.
* అనుకున్నంతగా మెగా డీఎస్సీ..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ( Mega DSC)ఫైల్ పై తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అన్ని అడ్డంకులు దాటి 16,347 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు నెల రోజులకు పైగా ఆన్లైన్లో పరీక్షలు కూడా నిర్వహించారు. అనుకున్న సమయం కంటే రెండు రోజుల ముందే ఫలితాలు కూడా ప్రకటించారు. మెరిట్ మార్కులు సాధించిన వారి ధ్రువపత్రాలను పరిశీలించారు. అయితే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ఆధ్వర్యంలో ఈ ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. అయితే ఇప్పుడు ఈ నెల 15న తుది జాబితా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 19న అమరావతిలో సభ ఏర్పాటు చేసి ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వనున్నారు.
* అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో..
ఈనెల 18 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు( assembly sessions ) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందే 15న తుది జాబితాను విడుదల చేస్తారు. 19న అమరావతిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అక్కడే ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లు అందించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకోగా.. ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వడబోస్తున్నారు. ఈ పరిశీలన పూర్తయ్యాక ఒకటి రెండు రోజుల్లో ఆ జాబితాలను జిల్లాలకు పంపనన్నారు. డీఎస్సీ డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యులతో సంతకాలు చేయిస్తారు. అనంతరం 15న తుది జాబితాలు ప్రకటిస్తారు. 19న వీరికి నియామక పత్రాలు జారీ చేయనున్నారు. 22 నుంచి కానీ 24 నుంచి కానీ దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. మళ్లీ అక్టోబర్ మూడున పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఆ సమయంలో శిక్షణ ఇచ్చి.. పాఠశాలలు తిరిగి తెరుచుకున్న నాడు పోస్టింగ్ ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రణాళిక తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ దసరా సెలవుల్లో శిక్షణ అంటే.. అభ్యంతరాలు వస్తే మాత్రం షెడ్యూల్ మారే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.
































