గత కొంతకాలంగా జియో, ఎయిర్‌టెల్‌కు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇస్తోంది. సరికొత్త ఆఫర్లతో ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇటీవలే ఫ్రీడమ్ ఆఫర్ పేరుతో రూ.1కే నెల రోజుల పాటు నెట్, అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్ ఇచ్చింది.
ఇప్పుడు అతితక్కువ ధరకే మరో అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ధర కేవలం రూ.199. ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీల ప్లాన్‌లతో పోలిస్తే చాలా తక్కువ ధర.
BSNL రూ.199 ప్లాన్ పూర్తి వివరాలు
ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత కూడా ఇంటర్నెట్ స్పీడ్ 40kbps ఉంటుంది. అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, రోజుకు 100 ఉచిత SMSలు వస్తాయి.
ప్రైవేట్ కంపెనీల కంటే చౌకైన ప్లాన్
ప్రస్తుతం రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ లేదా వొడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఏవీ కూడా రూ.200 కంటే తక్కువ ధరకు రోజుకు 2GB డేటా ప్లాన్‌ను అందించడం లేదు. అయితే BSNL ఈ ప్లాన్‌లో 4G డేటా మాత్రమే అందిస్తుండగా.. ఇతర కంపెనీలు 5G డేటాను అందిస్తున్నాయి.
ఇతర కంపెనీల ప్లాన్‌లు
జియో రూ.349 ప్లాన్: 28 రోజుల వాలిడిటీతో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, 100 SMSలు, JioTV సబ్‌స్క్రిప్షన్.
ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్: 28 రోజుల వాలిడిటీతో రోజుకు 2GB 5G డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 SMSలు, ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, SonyLIV వంటి 20కి పైగా OTT యాప్‌లకు యాక్సెస్.
వీఐ రూ.408 ప్లాన్: 28 రోజుల వాలిడిటీతో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 SMSలు, SonyLIV సబ్‌స్క్రిప్షన్. రోజుకు 2GB డేటా అయిపోయినా 64kbps స్పీడ్‌తో డేటా వస్తుంది.
కస్టమర్ బేస్‌ను కోల్పోతున్న BSNL
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. BSNL తమ కస్టమర్లను కోల్పోతూ వస్తున్నాయి. జూలై 2025లో BSNL ఏకంగా 1.01 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ప్రభుత్వ టెలికాం కంపెనీల మొత్తం మార్కెట్ వాటా ఇప్పుడు 8శాతం కంటే తక్కువకు పడిపోయింది. అదే సమయంలో జియో జూలైలో 4.83 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుని మొదటి స్థానంలో ఉంది. ఎయిర్‌టెల్ 4.64 లక్షల మంది కస్టమర్లను చేర్చుకుంది. అయితే వొడాఫోన్-ఐడియా మాత్రం 3.59 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది.
































