తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న 33 మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కారణం వీరంతా అన్యమత ఉద్యోగులు. ఇటీవల టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం, రాబోయే పది రోజుల్లోగా ఈ ఉద్యోగులు వీఆర్‌ఎస్‌కు సంబంధించి అంగీకార పత్రాలు సమర్పించాలని వారికి సూచించారు. ఉద్యోగంలో చేరేటప్పుడు తాము హిందువులమని ధ్రువీకరించుకుని, ఆ తర్వాత అన్యమత ప్రార్థనలకు వెళ్తున్నట్లు గుర్తించిన వారిపై టీటీడీ అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే తొమ్మిది మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా, మిగిలిన 33 మంది ఉద్యోగులను వీఆర్‌ఎస్ తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ 33 మంది ఉద్యోగుల్లో 24 మందికి పింఛను సౌకర్యం ఉంది. కాగా మిగిలిన తొమ్మిది మందికి ఆ సౌకర్యం లేదు.
టీటీడీలో హిందువులు కానివారు ఉద్యోగాల్లో చేరి, తర్వాత మత మార్పిడికి పాల్పడుతున్నారంటూ గతంలోనే పలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉండగానే ఇటీవల ముగ్గురు ఉద్యోగులు ఆధారాలతో పట్టుబడటంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో 125 మంది ఉద్యోగుల వివరాలను కూడా టీటీడీ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, అన్యమత ఉద్యోగులను వీఆర్‌ఎస్‌పై పంపేందుకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, ఉద్యోగులు రాబోయే పది రోజుల్లోగా తమ అంగీకారాన్ని తెలియజేయాలి.
ఉద్యోగంలో చేరేటప్పుడు హిందువులుగా పేర్కొని, ఆ తర్వాత ఇతర మతాలకు చెందిన ప్రార్థనలకు వెళ్తున్న వారిపై టీటీడీ దృష్టి సారించింది. ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో, ఈ వ్యవహారంపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
తిరుమలలో అన్యమత ఉద్యోగుల అంశం తీవ్ర వివాదాస్పదంగా నిలిచిన సంగతి తెలిసిందే. దేవస్థానంలో అన్యమత ఉద్యోగులను కొనసాగించబోమని టీటీడీ గతంలోనే స్పష్టం చేసింది. దీని గురించి పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అన్యమత ఉద్యోగులను తొలగించడానికి రెండు ఆప్షన్లు ఇచ్చింది.
VRS (స్వచ్ఛంద పదవీ విరమణ).. దీనికి ఆమోదం తెలిపితే, వారికి మిగిలిన సర్వీసు కాలానికి చెల్లించాల్సిన జీతభత్యాలను చెల్లిస్తారు, అది కూడా ఒకేసారి. వీఆర్ఎస్ ఆఫర్ వద్దనుకున్న వారికి ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు అంగీకరించడంతో, ఇప్పుడు దీన్నే అమలు చేస్తున్నారు.


































