ఇటీవల కాలంలో ప్రపంచంతో పాటు ఇండియాలో కూడా కార్ల వాడకం గణనీయంగా పెరిగింది. దీంతో మార్కెట్లోకి వరుసగా కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. కంపెనీలు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు ఉన్న మోడల్స్‌ను కూడా లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా అప్ డేట్ చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు తమకు నచ్చిన దాన్ని కొనుగోలు చేయడానికి షోరూమ్‌ల ముందు క్యూ కడుతున్నారు.
ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మారుతి సుజుకి పేరు చాలా స్పెషల్. తమ బ్రాండ్ నుంచి వచ్చిన వాహనాలతో తరతరాలుగా వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే సేఫ్టీ స్టాండర్డ్స్ విషయంలో మాత్రం ఈ సంస్థ కార్లు గతంలో చాలా విమర్శలను ఎదుర్కొన్నాయి. ఆ విమర్శలకు సమాధానం చెబుతూ.. మారుతి ఓ కారు మాత్రం సేఫ్టీలో అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఈ కారు ఫైవ్-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఎస్‌యూవీల కాలం నడుస్తోంది. సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాలు కాస్త క్షీణించాయి. ప్రస్తుతం సెడాన్‌లను కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు వాటి అమ్మకాల గణాంకాలను చూస్తే తెలిసిపోతుంది. దీనికి గల కారణాలు తెలియనప్పటికి కస్టమర్లు ఇతర సెగ్మెంట్లపై ఎక్కువ ఆసక్తి చూపించడం కారణంగా నెల నెలా సెడాన్ కార్ల విక్రయాలు తగ్గుతున్నాయి. దేశంలో ప్రస్తుతం లభిస్తున్న సెడాన్‌లు చాలా వరకు కస్టమర్లకు వారి బడ్జెట్లోనే లభిస్తున్నప్పటికీ గత నెలలో ఈ విభాగం కార్లను తక్కువగా కొనుగోలు చేశారు. కాకపోతే ఓ మోడల్ మీద మాత్రం తమకు మమకారం ఇంకా పడిపోలేదని ఇండియన్ కస్టమర్లు తెలిపారు.
అదే న్యూ జనరేషన్ మారుతి సుజుకీ డిజైర్. ఇది ఒక కాంపాక్ట్ సెడాన్. ఇది లేటెస్ట్ డిజైన్ తో డెవలప్ చేశారు. ఈ మోడల్ మంచి రైడ్ క్వాలిటీ, సౌకర్యవంతమైన ఫీచర్స్, ఐదుగురు వ్యక్తులు హాయిగా ప్రయాణించే విధంగా ఇంటీరియర్ స్పేస్, అలాగే సీఎన్జీ ఆఫ్షన్ కారణంగా ఇది కస్టమర్లు ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.
మరీ ముఖ్యంగా సేఫ్టీలో కూడా ఈ మోడల్ కొత్త రికార్డు సృష్టించింది. మారుతిలోనే ఫస్ట్ సేఫ్టీయెస్ట్ కారుగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఏ మారుతి మోడల్ సాధించని 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించడం ద్వారా మారుతి సుజుకి డిజైర్ భారతదేశంలోని సెడాన్ విభాగంలో కస్టమర్లకు ఇష్టమైనదిగా మారింది. అలాగే ఇది మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఉంటుంది. అంతేకాకుండా ఈ కారు మంచి మైలేజ్‌ని కూడా అందిస్తుంది.
గత నెల అంటే ఫిబ్రవరిలో కస్టమర్లు అధికంగా ఈ కారును కొనుగోలు చేశారు. ఫిబ్రవరి 2025లో మొత్తం 14,694 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. దీని సరసమైన ధర, ఆకట్టుకునే మైలేజీ ఇండియాలో చాలా మంది వినియోగదారులను ఆకర్షించడానికి కారణాలు. అలాగే, ఈసారి కంపెనీ భద్రత పెంచడం కూడా అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచింది.
కొత్త డిజైర్ స్పెసిఫికేషన్లు: ఇండియాలో డిజైర్ ప్రారంభ ధర రూ. 6.84 లక్షల నుంచి రూ. 10.19 లక్షల వరకు ఉంటుంది. ఈ రెండు ధరలు కూడా ఎక్స్ షోరూమ్‌వే. మారుతి సుజుకి డిజైర్ ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ బీజ్ (అప్పర్ సెక్షన్, డాష్, సీట్స్, బ్లాక్ (డాష్, డోర్ కార్డ్‌లు, లోయర్ సెక్షన్) థీమ్‌ను కలిగి ఉంది.
డాష్‌బోర్డ్‌పై వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన పెద్ద 9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ అందించారు. ఇది ఆర్కేమ్స్ సౌండ్ సిస్టమ్‌కి కనెక్ట్ చేశారు. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ 360-డిగ్రీ కెమెరాకు డిస్ప్లేగా కూడా పనిచేస్తుంది. కొత్త డిజైర్ క్యాబిన్ బ్యాక్ ఏసీ వెంట్స్, మల్టీ USB పోర్ట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్.. అలాగే ఈ విభాగంలో మొదటిసారిగా ఎలక్ట్రిక్ సింగిల్-పేన్ సన్‌రూఫ్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లతో జనాలను ఆకట్టుకుంటుంది. పెట్రోల్ ఇంజిన్ 6000rpm వద్ద 82bhp, 4200rpm వద్ద 113nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక డీజిల్ ఇంజిన్ 4000rpm వద్ద 74bhp, 2000rpm వద్ద 190nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
రెండు ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా AMT గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంటాయి. అలాగే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. డిజైర్‌లోని సేఫ్టీ ఫీచర్స్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, EBD తో ABS, బ్రేక్ అసిస్ట్, ప్రతి సీటుకు త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు ఉన్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే, డిజైర్‌లో Z12E ఇంజిన్ ఉంటుంది. డిజైర్ మునుపటి K సిరీస్ నుంచి కొత్త Z12E ఇంజిన్‌కి మారడంతో పవర్, టార్క్ తగ్గింది. ఒక సిలిండర్ లేకుండా పోయినప్పటికీ డిజైర్ పర్ఫామెన్స్ (8bhp, 1.5Nm) పరంగా ఎలాంటి ప్రభావం పడలేదు. CNG ఆప్షన్ కూడా కొనుగోలుకు అందుబాటులో ఉండటం మంచి విషయం.
పెట్రోల్ డిజైర్ 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆఫ్షన్లతో అందిస్తున్నారు. CNG వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆఫ్షన్‌తో మాత్రమే లభిస్తుంది. డిజైర్ పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ లీటరుకు 24.79 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఏఎమ్‌టి లీటరుకు 25.71 కి.మీ మైలేజీని అందిస్తుంది. CNG వేరియంట్ కిలోకు 33.73 కి.మీ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : ఇండియాలో SUVలతో పోలిస్తే సెడాన్‌ల అమ్మకాలు తగ్గముఖం పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 10 సెడాన్ మోడల్స్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్నాయి. సెడాన్ కార్ల అమ్మకాలు నెల నెలా తగ్గుతున్నప్పటికి మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలు మాత్రం బాగానే ఉన్నాయి. దీంతో ఇతర కంపెనీలు తమ సెడాన్ విక్రయాలను పెంచడంపై దృష్టి సారించాయి. రానున్న రోజుల్లో వీటి సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది.