4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?

www.mannamweb.com


Vasuki Indicus | న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: గుజరాత్‌లోని కచ్‌లో లభించిన శిలాజాలపై ఐఐటీ రూర్కీ జరిపిన పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ అనే జర్నల్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. పనాంద్రో లిగ్నైట్‌ మైన్‌లో దొరికిన 27 ఎముకలు ప్రపంచంలోనే అతి పెద్ద పాము వెన్నెముకకు చెందినవని పరిశోధకులు గుర్తించారు. ఈ పాము దాదాపుగా 11 నుంచి 15 మీటర్ల వరకు ఉండొచ్చని వీరు భావిస్తున్నారు.

ఇది ప్రపంచంలో ఇప్పటివరకు అతిపెద్ద పాముగా గుర్తింపు పొందిన టైటానోబోవాను పోలి ఉందని తెలిపారు. భారీ సైజులో ఉన్నందున ఈ పాము కూడా అనకొండలా మెల్లిగా కదలగలిగేదని భావిస్తున్నారు. పరిశోధకులు ఈ పాముకు శివుడి మెడలోని పాము పేరైన ‘వాసుకి’ కలిసి వచ్చేలా ‘వాసుకి ఇండికస్‌’ అని పేరు పెట్టారు. ఈ పాము ఒకప్పుడు భారత్‌, ఆఫ్రికా, యూరోప్‌లో జీవించి అంతరించిపోయిన మాడ్ట్సోయిడై కుటుంబానికి చెందినదిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఈ శిలాజాలు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని అంచనా వేస్తున్నారు.