వేడి ఆహారం, మాంసం, ఆమ్ల పండ్లు, కొవ్వు పదార్థాలు, పులియబెట్టిన పదార్థాలు ప్లాస్టిక్‌లో పెట్టడం ఆరోగ్యానికి హానికరం. గాజు, స్టీల్ పాత్రలు ఉపయోగించాలి.
సాధారణంగా మనం ఇంట్లో వంటగదిలో ప్లాస్టిక్ డబ్బాలను ఎక్కువగా వాడతాం. అవి తేలికగా ఉండటం, చౌకగా దొరకడం, విరగకపోవడం వంటివి కారణాలు. కానీ ప్రతీ ఆహారం ప్లాస్టిక్‌లో నిల్వ చేయడం ఆరోగ్యానికి సురక్షితం కాదు. ఎందుకంటే ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయనాలు కొంతసేపు తర్వాత ఆహారంలో కలిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా వేడి ఆహారం, ఆమ్ల పదార్థాలు, నూనె ఎక్కువగా ఉన్న ఆహారాలు ఈ రసాయనాలను త్వరగా గ్రహిస్తాయి. దీనివల్ల ఆ ఆహారంలోని మంచితనం పోయి, విషపూరితంగా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని ఆహారాలను ప్లాస్టిక్‌లో ఎప్పుడూ పెట్టకూడదు.
వేడి ఆహారం: వంట పూర్తయిన వెంటనే వేడిగా ఉన్న ఆహారాన్ని ప్లాస్టిక్‌లో వేసే తప్పు చాలామంది చేస్తారు. కానీ అది చాలా ప్రమాదం. వేడి కారణంగా ప్లాస్టిక్ రసాయనాలు కరిగి ఆహారంలో కలిసిపోతాయి. అలాగే మూతపెట్టినప్పుడు ఆవిరి పేరుకుని బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి వేడి ఆహారాన్ని చల్లారిన తర్వాత మాత్రమే గాజు లేదా స్టీల్ పాత్రల్లో పెట్టాలి.
మాంసం మరియు చేపలు: చాలా మంది చికెన్, మటన్, చేపల వంటి మాంసాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి ఫ్రీజ్ చేస్తారు. కానీ ఆ ప్లాస్టిక్ తేమను ఎక్కువగా నిల్వ చేస్తుంది. దాంతో సూక్ష్మక్రిములు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రిజ్‌లో ఉన్న ఇతర ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే మాంసాన్ని గాజు లేదా స్టీల్ బాక్స్‌లలో నిల్వ చేస్తే మిక్కిలి సురక్షితం.
ఆమ్ల పండ్లు మరియు కూరగాయలు: టమోటా, కమలపండు, నిమ్మ, బెర్రీలు వంటి వాటిలో సహజ ఆమ్లం ఉంటుంది. ఇవి ప్లాస్టిక్‌తో రసాయన చర్య జరిగి రుచిని చెడగొడతాయి. దీని వల్ల ఆహారం పాడవడం మాత్రమే కాదు, శరీరానికి హానికరమవుతుంది కూడా.
కొవ్వు మరియు నూనె పదార్థాలు: వెన్న, చీజ్, సాస్, నూనె ఎక్కువగా ఉన్న వంటకాలు ప్లాస్టిక్‌లో పెడితే, అవి కూడా రసాయనాలను శోషించుకుంటాయి. ఇవి తిన్నప్పుడు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
పులియబెట్టిన పదార్థాలు: ఊరగాయలు, కిమ్చి, కార్బోనేటెడ్ డ్రింక్స్ వంటివి లోపల గాలి వదిలి ఒత్తిడిని పెంచుతాయి. ప్లాస్టిక్ కంటైనర్లు దీన్ని తట్టుకోలేక చిట్లిపోవచ్చు లేదా లీక్ అవుతాయి. దీంతో ఆహారం పాడవడమే కాకుండా తినడానికి పనికిరాని స్థితికి చేరుతుంది.
ఇలా చూస్తే ప్రతీ ఆహారం ప్లాస్టిక్‌లో పెట్టడం సరైంది కాదని స్పష్టమవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గాజు సీసాలు, స్టీల్ కంటైనర్లు లేదా సిరామిక్ జార్లు వాడటం మంచిది. ఇవి రసాయనాల రహితమైనవి మాత్రమే కాకుండా, ఆహారాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉంచుతాయి. చిన్న జాగ్రత్తతో మనం కుటుంబానికి సురక్షితమైన ఆహారాన్ని అందించవచ్చు.
































