వయసు ఎక్కువయ్యే కొద్ది మహిళలకు ఆరోగ్యం విషయంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా 30లు, 40ల వయసు దాటిన తర్వాత వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. అందుకే మహిళలు పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం, ఎక్సర్‌సైజ్ రెగ్యులర్‌గా పాటించాలి.
ఆరోగ్యంపై నిత్యం దృష్టి సారించాలి. అయితే, మహిళలకు వచ్చే కొన్ని వ్యాధులను ప్రాథమిక దశలో బయటపడవు. వైద్య పరీక్షలతోనే తెలుస్తాయి. వీటిని ముందే గుర్తిస్తే తగ్గించడం సులభం అవుతుంది. ఆలస్యమైతే చాలా కష్టంగా మారుతుంది. అందుకే, 30, 40ల వయసులో ఉన్న మహిళలు కొన్ని వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆ పరీక్షలు ఏవో ఇక్కడ చూడండి.
మమ్మోగ్రామ్
40ల వయసు దాటిన మహిళకు రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాన్సర్ కేసులు కొన్నేళ్లుగా చాలా పెరిగిపోతున్నాయి. ప్రాథమిక దశలో దీన్ని గుర్తించకపోతే సమస్య పెరిగిపోతుంది. క్యాన్సర్ ముదిరితే తగ్గడం చాలా కష్టమవుతుంది. అందుకే, 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలందరూ మోమ్మోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. ఈ వయసులో ఉన్న వారు కనీసం రెండేళ్లకు ఓసారైనా ఈ టెస్ట్ చేయించుకోవాలి. రొమ్ములకు చేసే ఈ ఎక్స్-రే టెస్ట్ ద్వారా రొమ్ము సమస్యలు ఏమైనా ఉన్నా, రొమ్ము క్యాన్సర్ ఉన్నా బయటపడతాయి. రొమ్ముల్లో నొప్పి, గడ్డలుగా అనిపించడం, చర్మపు రంగు మారుతున్నట్టు అనిపిస్తే వెంటనే మమ్మోగ్రామ్ చేయించుకోవాలి.
రెగ్యులర్ రక్త పరీక్ష
ఏదైనా ఆరోగ్య సమస్యను ముందే గుర్తించడం చాలా ముఖ్యం. అందుకే మహిళలు రెగ్యులర్‌గా రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఇది చాలా ముఖ్యమైన విషయం. రక్త పరీక్షల్లోని విషయాలను బట్టి ఆరోగ్యం గురించిన నిర్ణయాలను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. రెగ్యులర్ రక్త పరీక్షల్లో అనేమియా టెస్ట్, బ్లడ్ ప్రెజర్ టెస్టు, కొలెస్ట్రాల్ చెకప్, బ్లడ్ గ్లూకోజ్ టెస్టు, విటమిన్ డీ లాంటి టెస్టులు ఉంటాయి. వీటికి సంబంధించిన ఫలితాలను బట్టి కొన్ని విషయాల్లో మార్పులు చేసుకోవచ్చు. కనీసం రెండు సంవత్సరాలకు ఓసారైనా పూర్తిస్థాయి రక్త పరీక్షలను మహిళలు చేయించుకోవాలి.
పెల్విక్ పరీక్ష
మహిళలకు పెల్విక్ (గర్భాశయ ముఖద్వారం) ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటాయి. అందుకే పెల్విక్ వైద్య పరీక్షను కచ్చికంగా చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ ఉంటే ఈ పరీక్షల్లో బయటపడుతుంది. ఒకవేళ ఈ క్యాన్సర్ ఉంటే ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. సర్వైకల్ క్యాన్సర్ ముదిరితే చాలా ప్రమాదం ఉంటుంది. పెల్విక్ పరీక్షను 20 ఏళ్లు దాటిన దగ్గరి నుంచి మహిళలు ఏడాదికి ఓసారి చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.
ఎముకల సాంద్రత పరీక్ష
వయసు పెరుగుతున్న కొద్ది మహిళల ఎముకల సాంద్రత తగ్గుతూ ఉంటుంది. అందుకే 35 ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా ఎముకల సాంద్రత పరీక్ష (బోన్ డెన్సిటీ టెస్ట్ – బీఎండీ) తప్పనిసరిగా చేయించుకోవాలి. కనీసం రెండేళ్లకు ఓసారైనా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఎముకల దృఢత్వం ఏ స్థాయిలో ఉందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పరీక్ష ద్వారా క్లారిటీ వస్తుంది. ఎముకలు పెళుసుబారి చిన్న ప్రమాదాలకే విరిగిపోయే ఆస్టోపెరోసిస్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడొచ్చు.
హర్మోన్ల పరీక్షలు
మహిళలకు శరీరంలో హార్మోన్ల అసమతుల్యత చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం జీవిన శైలిలో మార్పుల వల్ల హార్మోన్లు అదుపు తప్పుతున్నాయి. ఇది తెలుసుకునేందుకు మహిళలు హార్మోన్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. దీనివల్ల వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి. వివిధ రకాల హార్మోన్ల గురించి ఈ పరీక్షల్లో బయటపడతాయి.