50-30-20 Rule : ’50-30-20′ పొదుపు సూత్రం తెలుసా ?

www.mannamweb.com


50-30-20 Rule : 50-30-20 పొదుపు సూత్రం చాలా ముఖ్యం. భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేయాలని భావించే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్ అవసరాలు తీరాలంటే ఇప్పుడే పొదుపు చేయడం మొదలుపెట్టాలి.
లేదంటే రానున్న రోజుల్లో కష్ట కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకోసం చాలా మంది సేవింగ్స్ అకౌంట్​లో డబ్బులను జమ చేస్తుంటారు. అయితే అదొక్కటే సరిపోతుందా ? పొదుపు కోసం సరైన వ్యూహం ఏమిటి ? 50-30-20 పొదుపు సూత్రం ఏం చెబుతోంది ? ఇప్పుడు తెలుసుకుందాం..

50-30-20 సూత్రం ఏం చెబుతోంది ?

మీకు ప్రతినెలా వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని ఇంటి అవసరాలకు కేటాయించాలి. వాటితో నిత్యావసరాలు కొనాలి. ఫీజులు, రవాణా, రుణ వాయిదాల చెల్లింపు వంటివి చేయాలి. సంపాదనలో 30 శాతం మొత్తాన్ని వస్తువుల కొనుగోళ్లకు, కుటుంబ సభ్యుల సరదాకు, సంతోషాల కోసం వాడాలి. మిగతా 20 శాతం సొమ్మును పొదుపుకు వాడాలి.
ఒక వేళ మన ఖర్చులకు అధిక మొత్తం అవసరమైతే.. సరదా, సంతోషాల కోసం కేటాయించే బడ్జెట్‌లో కోత పెట్టుకోవాలి. పొదుపు ఖాతాలో జమ చేసిన మొత్తంలో మీ అవసరాలకు తగినంత సొమ్మును ఉంచుకుని, మిగతా డబ్బులను పెట్టుబడులకు మళ్లించాలి.
ఎమర్జెన్సీ ఫండ్

మన జీవితంలో ఆకస్మికంగా ఎలాంటి ఆర్థిక అవసరాలు వస్తాయో చెప్పలేం. కనుక కచ్చితంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం 6 నుంచి 12 నెలలకు సరిపడా డబ్బులను అత్యవసర నిధిలో రెడీ ఉంచాలి. ఈ మొత్తాన్ని మీ సేవింగ్స్ అకౌంట్‌లోనే ఉంచండి. ఒకేసారి పెద్ద మొత్తం నిధిని జమ చేయలేని పరిస్థితి ఉంటే.. మీకు వీలైనంత కనీస మొత్తాలను పొదుపు చేయండి.

మినిమం బ్యాలెన్స్

నష్టభయం లేని రాబడుల కోసం పొదుపు ఖాతాలు బెటర్. అయితే మీరు ఎంచుకున్న బ్యాంకు, ఖాతా రకాన్ని బట్టి, అందులో ఎంత మినిమం బ్యాలెన్స్ పొదుపు చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. సాలరీ అకౌంట్​లో సున్నా నిల్వ ఉన్నా ఏం కాదు. మిగతా పొదుపు ఖాతాల విషయానికి వస్తే, కనీసం రూ.500 నుంచి రూ.5 లక్షల వరకూ మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.

ఇంట్రెస్ట్ పెరిగేలా..

సేవింగ్స్ అకౌంట్​లో పొదుపు చేసే మొత్తంపై వడ్డీ చాలా తక్కువ. అందుకే ఫ్లెక్సీ డిపాజిట్లు చేయండి. దీని వల్ల పొదుపు ఖాతా, ఫిక్స్​డ్ డిపాజిట్ల ప్రయోజనాలు రెండూ దక్కుతాయి. మీ దగ్గర నెలవారీ ఖర్చులకు, అత్యవసర నిధికి మించి డబ్బు ఉంటే, నష్టభయం లేని లిక్విడ్‌ ఫండ్లు, డెట్‌ ఫండ్లలో పెట్టుబడులుగా మార్చొచ్చు. దీని వల్ల మీకు దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుంది. మన ఆన్‌లైన్ లావాదేవీలు ఇప్పుడు చాలా పెరిగాయి. దీంతో చాలామంది జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు. అయినప్పటికీ మీ దగ్గర నగదు రూపంలో కొంత మొత్తం ఉంచుకోవడం బెటర్. ఇది ఎంత అనేది మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది.