మ్యాథమాటిక్స్.. గణితం.. ఏ భాషలో ఎలా పిలిచినా ఈ సబ్జెక్ట్ అంటే చిన్నారులకు భయం. మ్యాథ్స్ సబ్జెక్ట్‌ను, దాన్ని చెప్పే టీచర్‌ను తలచుకుంటేనే పిల్లల్లో వణుకు వస్తుంది.
ఇక లెక్కలు చేయడమంటే.. అంతకు మించి భయపడతారు. ఇదే అనుభవాన్ని చాలా మంది తమ చిన్నతనంలో ఎదుర్కొని ఉంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా సరిగ్గా ఇలాంటి ఓ భయపెట్టే గణిత సమస్య గురించే. అది 5వ తరగతికి చెందినది. ఏంటీ.. 5వ తరగతి మ్యాథ్స్ ప్రశ్న అంత హార్డ్‌గా ఉంటుందా..? చాలా సులభంగా సాల్వ్ చేయవచ్చు కదా..! అని మీరు అనుకోవచ్చు. కానీ నిజానికి మీరు ఆ లెక్కను చూస్తే అలా అనుకోరు. చాలా హార్డ్‌గా ఉంటుంది. ఒక పట్టాన మీకు అర్థం కాదు. ఇక దానికి ఆన్సర్‌ను మీరు చెప్పలేరు. అవును, మీరు విన్నది నిజమే. కావాలంటే ఆ లెక్కను ఓ సారి చూడండి..!
ఓ షిప్‌లో 26 గొర్రెలు, 10 మేకలు ఉన్నాయి. అప్పుడు ఆ షిప్‌ను నడిపే వ్యక్తి(కెప్టెన్) వయసు ఎంత ఉంటుంది? అదీ ప్రశ్న. ఇంకెందుకు ఆలస్యం.. ఈ లెక్కను సాల్వ్ చేయండి మరి. ఏంటీ.. అర్థం కావడం లేదా. అసలు నిజంగా ఇది ఓ ప్రశ్నేనా ? లేక తమాషా చేయడం కోసం కావాలని ఇలాంటి లెక్కలు అడుగుతున్నారా ? అని అనుకుంటున్నారా. కానీ ఇది నిజంగా ప్రశ్నేనండీ.. ముందే చెప్పాం కదా. మీరు సాల్వ్ చేయలేరని. అయితే అసలు ఈ ప్రశ్న 5వ తరగతి లెక్కల సబ్జెక్ట్‌లో ఉంటుంది అంటున్నాం కదా.. అది ఎక్కడో.. అసలు దీన్ని ఎవరు వేశారో తెలుసా..?
చైనాలోని షంగింగ్ అనే జిల్లాలో ఉన్న ఓ స్కూల్‌లో ఎగ్జామ్స్ నిర్వహించారు. అందులో 5వ తరగతి చదువుతున్న పిల్లలకు పైన లెక్క ఇచ్చారు. దీంతో స్టూడెంట్స్ ఎవరూ దాన్ని సాల్వ్ చేయలేదు. చివరకు ఈ ప్రశ్నను వారు తమ పేరెంట్స్‌కు చెప్పారు. వారు కూడా సాల్వ్ చేయలేదు. చివరికి వారు ఇలాంటి ప్రశ్న ఇచ్చారేంటి, అసలిది ప్రశ్నేనా, పిచ్చి లెక్కలు అడిగి పిల్లల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారా అంటూ పేరెంట్స్ స్కూల్ అధ్యాపకులను నిలదీశారు. దీనికి వారు స్పందిస్తూ.. అది సరైన ప్రశ్నే అని చెప్పారు. పిల్లల్లో క్రిటికల్ అవేర్‌నెస్, ఇండిపెండెంట్ థింకింగ్ అనే స్వభావాలను పెంచడం కోసమే ఇలాంటి ప్రశ్న ఇచ్చినట్లు చెప్పారు.
అయితే ఈ ప్రశ్న అంతటితో ఆగలేదు. ఇంటర్నెట్‌లో.. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఈ ప్రశ్నను సాల్వ్ చేయలేక జుట్టు పీక్కున్నారు. ఈ ప్రశ్నపై జోక్‌లు కూడా వేశారు. అయితే చివరకు దీనికి ఓ వ్యక్తి సమాధానం చెప్పాడు. మరి ఆ సమాధానం ఏమిటో తెలుసా..?
26 గొర్రెల, 10 మేకల బరువు 7700 కిలోలు అనుకుందాం. ఒక జంతువు సగటు బరువు ఆధారంగా 7700 కిలోలు లెక్కవేద్దాం. చైనాలో 5000 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండే కార్గోను షిప్పుల్లో తీసుకెళ్లాలంటే.. దానికి సపరేట్ లైసెన్స్ కలిగి ఉండాలి. అది రావాలంటే కనీసం ఐదు సంవత్సరాలు ఆగాలి. ఇక చిన్నపాటి బోట్ లైసెన్స్ రావడానికి కనీస వయసు 23 గా చైనాలో నిబంధన ఉంది. అంటే ఆ షిప్ కెప్టెన్ 23 ఏళ్ల వయస్సు అప్పుడు బోట్ లైసెన్స్ పొంది ఉంటే.. మరో 5 ఏళ్లు ఆగాక అతనికి 5వేల కిలోల కన్నా ఎక్కువ బరువు ఉన్న కార్గోను షిప్పుల్లో నడిపే లైసెన్స్ వస్తుంది. అంటే 23 + 5 = 28 అవుతుంది. అంటే ఆ కెప్టెన్ కనీస వయసు 28 అయి ఉండాలి అని పూస గుచ్చినట్లు వివరించాడు ఆ వ్యక్తి. కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం దొరికినట్టే కదా..! ఏది ఏమైనా ఇలాంటి ప్రశ్నలు వేస్తే పిల్లల్లో ఇంకా భయం పెరగడం మాత్రం ఖాయం కదా..!