గుడ్‌న్యూస్.. త్వరలో పోలీస్ శాఖలో 6,100 పోస్టుల భర్తీ

www.mannamweb.com


ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు ప్రశాంతత ఉంటుంది. భయపడుతూ బతికితే అభివృద్ధి జరగదు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి..

పరిశ్రమలు రావాలంటే పెట్టుబడులు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రశాంతమైన వాతావరణం రావాలంటే పటిష్టమైన చర్యలు, చట్టాలు అవసరం. గతంలో ఇంతకంటే కష్టమైన పరిస్థితులు చూశాను. హైదరాబాద్ లో విద్వేషాలు, మత కలహాలు, సీమలో ఫ్యాక్షన్, విజయవాడలో రౌడీయిజం ఉండేది.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటే తప్ప పెట్టుబడులు రావని ఆలోచించి మనతన బేధం లేకుండా ఫ్యాక్షన్ అణచివేశామన్నారు.

రాష్ట్రంలో వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. గత ఐదేళ్లు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా చిరునామాగా ఏపీ పేరు వచ్చింది. ముంద్రా పోర్టుకు ఏపీ అడ్రస్ తో డ్రగ్స్ వచ్చాయి. దీనిపై నిరసన తెలిపితే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. గంజాయిపై ఏనాడూ సమీక్ష చేయకపోవడంతో గంజాయి బ్యాచ్ కు స్వేచ్ఛవచ్చి విచ్చలవిడిగా పండించేవారు, అమ్మేవాళ్లు పెరిగారు. గంజాయి తీసుకున్న వారికి తల్లి, చెల్లికి వ్యత్యాసం తెలీదు. ఏ నేరం జరిగినా గంజాయి మత్తులోనే చేస్తున్నారు. కాలేజీ పరిసరాల్లోకి కూడా గంజాయి వెళ్లింది. గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడిన వారిని మార్చాలంటే కష్టమవుతుంది.. ఇదొక దురదృష్టకర పరిణామం అన్నారు.

సోషల్ మీడియాలో అనుచిత భాషతో పోస్టులు పెడుతున్నారు. ఎప్పుడు ఎవరిపై ఏ ఆర్టికల్ వస్తుందో తెలీదు. తల్లి, చెల్లిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వారిని జగన్ ప్రోత్సహించారు. వర్రా రవీందర్ రెడ్డి.. ఇతనొక నేరస్తుడు. షర్మిల రాజశేఖర్ రెడ్డి బిడ్డకాదు విజయమ్మ బిడ్డ మాత్రమే అని పోస్టులు పెట్టాడు. ఇంకా నోటితో చెప్పలేని భాషతో పోస్టులు పెట్టాడు. ఇలాంటి దారుణమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని సమర్ధిస్తూ.. అతని పేరుతో తప్పుడు పోస్టులు పెట్టారని వెనకేసుకొచ్చాడు. వర్రా రవీందర్ రెడ్డి పోస్టుల వెనక అవినాష్ రెడ్డి, అతని పీఏ ఉన్నారని, అరెస్టు చేయాలని షర్మిల కోరింది. తనపై అసభ్యంగా పోస్టులు పెట్టారని బాధితురాలే చెప్తుంటే ఇంకా సమర్ధిస్తున్నారన్నారు. దళిత మహిళ, హోమంత్రి అనిత వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. డీజీపీ, ఉపముఖ్యమంత్రి అంటే లెక్కలేకుండా ప్రవర్తించారు. పవన్ కళ్యాణ్ పై పెట్టిన పోస్టులు చూస్తే మనసు వికలమవుతుంది.. బాధ కలుగుతుంది. ప్రజలకు సేవ చేయాలని వచ్చి అవమానాలు పడటం ఏంటని వారు బాధపడుతున్నారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు, వ్యాఖ్యలు చేస్తున్నారు. పేటీయం బ్యాచ్ ను పెట్టుకుని ఆర్గనైజ్డ్ గా ఇవన్నీ చేస్తున్నారు. డిజిటల్ కార్పొరేషన్ లో సొంత మనుషులను పెట్టి సోషల్ మీడియాలో పని చేయించుకున్నారు. వాళ్లే తెలివిగలవాళ్లు, ఆటలు సాగుతాయని అనుకుంటున్నారు. ఇక ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తా. పటిష్ట చట్టాలు తెచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తామన్నారు. .

భూమి సమస్య చాలా సున్నితమైంది. తల్లీబిడ్డకు ఉన్న సంబంధమే భూమికి, యజమానికి ఉంటుంది. రెండు సెంట్ల భూమి కోసం ఎన్నో పోరాటాలు చేసిన సందర్భాలు చూశాం. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది. 2023 జీవో నంబర్ 512 ద్వారా ఈ చట్టం తెచ్చారు. ఈ చట్టం ఒక కుట్ర.. రాజ్యాంగ విరుద్ధం. దీంతో మోసాలకు అక్రమాలకు తెరతీశారు. జ్యుడిషియల్ అధికారాలు తొలగించారు. సెక్షన్ 38 ప్రకారం.. సివిల్ జడ్జి అధికారాలను రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. ఎవరినైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారిగా పెట్టుకునేలా చట్టంలో పేర్కొన్నారు. అంటే సాక్షిలో పని చేసే గుమస్తాలను అధికారులుగా పెట్టాలని చూశారు. రెవెన్యూ రికార్డులో పేరు మార్పు చేయాలంటే ఆ యజమానికి నోటీసు కూడా ఇవ్వడానికి అవకాశం లేకుండా నేరుగా హైకోర్టులో తేల్చుకునేలా చేశారు. సామాన్యులు కోర్టులు చుట్టూ తిరగగలరా? టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఎవరి నైనా నియమించుకోవచ్చని పేర్కొన్నారు. ఇవన్నీ చూశాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. నాకు వచ్చే వినతుల్లో ఎక్కువ శాతం భూ సమస్యలకు సంబంధించినవే. అందుకే కఠినమైన చట్టాన్ని తెస్తున్నామని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేశాక యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామన్నారు. ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం అమలవుతుంది. భూమి కబ్జాకు ప్రయత్నించినా బెదిరించినా ఈ చట్టం ప్రకారం శిక్షిస్తాం. ల్యాండ్ కబ్జా చేయలేదని వారే నిరూపించుకోవాలన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే బయటకు కూడా రాలేరు. అక్రమాలకు పాల్పడ్డారని తెలిస్తే భూమి పోవడంతో పాటు, చట్ట ప్రకారం జైలుకు కూడా వెళతారన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా ఏర్పాటు చేస్తాం. పీడీ యాక్టుకు కూడా పదును పెడుతున్నాం. పకడ్బందీగా చట్టం ఉంటేనే అక్రమదారులు భయపడతారన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డవారిని 6 నెలల్లోనే శిక్షిస్తామని తెలిపారు.

కల్తీ విత్తనాలు అమ్మినా, ఇసుక అక్రమాలకు పాల్పడినా, బియ్యం మాఫియాకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తాం. పర్యాటకులు రావాలంటే రాష్ట్రంలో భదత్ర ఉండాలి. గత ప్రభుత్వంలో విదేశాల నుండి ఒక మహిళ వస్తే నెల్లూరులో కిడ్నాప్ చేసినా పట్టించుకోలేదు. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ చిరునామా కావాలంటే శాంతిభద్రతలు ముఖ్యం. స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2024 విజన్ సాకారం కావాలన్నా శాంతిభద్రతలు ఉండాలి. పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చిన వారిని శిక్షిస్తాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఊరుకోమన్నారు. పోలీసులు ప్రజాహితం కోసం పని చేయాలి.. దేశంలోనే మొదటిసారి బాడీ ఓన్ కెమెరాలు తీసుకొచ్చాం.. రాబోయే రోజుల్లో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం.. త్వరలోనే 6,100 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.60 కోట్లు కూడా విడుదల చేశామని తెలిపారు. మేము ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వినియోగించలేదు.. వాటిని మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తాం.. పోలీసు వాహనాలు కూడా నడిచే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. .

పర్యటనల కోసం గతంలో బలవంతంగా కార్లు లాక్కున్న పరిస్థితులు చూశాం. 2,812 వాహనాల కొనుగోలుకు రూ.281 కోట్ల నిధులు మంజూరు చేశాం. పోలీసు వాహనాలకు కనీసం పెట్రోల్ డబ్బులు కూడా ఇవ్వలేదు. అందుకే నాలుగు చక్రాల వాహనాలను 150 లీటర్లు నుండి 300 లీటర్లు డీజిల్, ద్విచక్ర వాహనాలకు 25 లీటర్ల నుండి 50 లీటర్లకు పెట్రోల్ వినియోగాన్ని పెంచామని తెలిపారు. పోలీసులకు రూ.859 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు.. వాటిని త్వరలోనే విడుదల చేస్తామన్నారు. వెల్ఫేర్ ఫండ్ కు రూ.20 కోట్లు విడుదల చేశాం. అమరవీరుల స్థూపం నిర్మాణానికి రాజధానిలో 5 ఎకరాలు కేటాయిస్తామని తెలిపారు.

ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. ఎఫ్ఎస్ఎల్ ను తుళ్లూరులో రూ.152 కోట్లతో పనులు ప్రారంభిస్తే దాన్ని కూడా పూర్తి చేయలేదు.. త్వరలోనే మేము పూర్తి చేస్తామన్నారు. రీజియన్ ఎఫ్ఎల్ఎస్ ను అనంతపురం, తిరుపతి, రాజమండ్రిలో ఏర్పాటు చేస్తాం. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ రాజధానిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ ను ఈగల్(ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ ఫోర్స్ మెంట్) ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు.

వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో సాక్షిలో గుండెపోటుతో చనిపోయారని కథనం నడిపారు. ఎవరైనా హత్య జరిగిందని తెలిస్తే వెంటనే వచ్చేస్తారు.. కానీ తీరిగ్గా సాయంత్రం రోడ్డు మార్గాన వచ్చారు అక్కడి సీఐని మేనేజ్ చేశారు. రక్తం మరకలు కనబడకుండా బాత్రూమ్ క్లీన్ చేసి వెంటనే ఫ్రీజర్ లో తెచ్చి పెట్టారు. గుండెపోటుతో చనిపోయారని విజయసాయిరెడ్డి కూడా చెప్పారు. సునీతారెడ్డి పోస్టుమార్టమ్ చేయాలని అడగ్గా, అప్పుడు నెత్తిపైన గొడ్డలి వేట్లు ఉన్నాయని తేలింది. మళ్లీ మరుసటి రోజు సాక్షిలో మాత్రం నారాసుర రక్త చరిత్ర అని నేను హత్య చేయించినట్లు రాశారు. ఇలాంటి పని ఎవరైనా చేయగలరా? కోడికత్తితో పొడిపించుకని సింపతీ పొందాలని చూశారు. విజయవాడలో గులకరాయితో కొట్టించుకున్నారు. ఏంటీ ఈ డ్రామాలు.? ఇలాంటి రాజకీయాలు నా జీవితంలో చూడలేదన్నారు.

రాజకీయ ముసుగులో నేరాలు చేయాలని చూస్తే ముసుగు తీసి నేరస్తులుగా చూపిస్తానని హెచ్చరించారు. మేము తప్పులు చేస్తే చెప్పండి.. విని సరిచేసుకుంటాం. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆటలు సాగవు అన్నారు. మృగాల కంటే హీనంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు ఏం చేయాలన్నా చట్టం కట్టేస్తోంది. ఇలాంటి వారిని సమాజం ఛీ కొట్టేలా చేయాలి.. ప్రజల నుండి దూరం చేయాలి. పోలీసులు వచ్చే లోపే తిరుగుబాటు చేసి నీచులను కొట్టాలి. ప్రభుత్వం చేసే ప్రయత్నాలను ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలన్నారు.