అరచేతిలో ఉండే ఆరంగుళాల స్మార్ట్ ఫోన్ పిల్లల జీవితాన్ని చిదిమేస్తోంది. చదువుకోవాల్సిన వయసులో ఫోన్లకు, వాటిలోని గేమ్స్‌కు అడిక్ట్ అవుతున్నారు.
ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్ బాల్యాన్ని చిదిమేస్తున్నాయి. అన్నం తినడం లేదని, ఏడుస్తున్నారని చిన్నప్పటి నుంచే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అలవాటు చేయడం వారి జీవితాల పాలిట శాపాలుగా మారుతున్నాయి. లక్నోలోని మోహన్ లాల్ గంజ్ ప్రాంతంలో ఆరవ తరగతి విద్యార్థి ఆన్లైన్ గేమ్స్ కు బానిసై రూ.13 లక్షలు పోగొట్టాడు. ఇంట్లో విషయం తెలిస్తే ఏమంటారోనన్న భయంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. యష్ కుమార్ అనే విద్యార్థి బిఐపిఎస్ స్కూల్ లో 6వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి సురేష్ కుమార్ యాదవ్ పెయింటర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఒక భూమిని అమ్మిన సురేష్ కుమార్.. రూ.13 లక్షలను యూనియన్ బ్యాంక్ బిజ్నోర్ బ్రాంచ్ లో డిపాజిట్ చేశాడు. సోమవారం (సెప్టెంబర్ 15) బ్యాంకుకు పాస్ బుక్ అప్డేట్ చేయించేందుకు వెళ్లగా.. డిపాజిట్ చేసిన డబ్బంతా కనిపించకపోయేసరికి కంగారుపడ్డాడు. స్టేట్ మెంట్ తీయించి చూడగా.. ఆ డబ్బు ఆన్‌లైన్ గేమ్స్‌లో బెట్టింగ్‌కు పెట్టినట్లు తేలింది.
దీంతో కొడుకును ప్రశ్నించగా.. తొలుత తనకేమీ తెలియదని సమాధానమిచ్చాడు. గట్టిగా అడగడంతో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నపుడు డబ్బును బెట్టింగ్ పెట్టి పోగొట్టుకున్నట్లు చెప్పాడు. సురేష్ అతన్ని తిట్టకుండా కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ట్యూషన్ టీచర్ కు కూడా విషయం చెప్పగా.. యష్ ను సరైన మార్గంలో పెట్టడంలో సహాయం చేస్తానని చెప్పాడు. ఎవ్వరూ ఏమీ అనకపోయినా.. యష్ మనస్తాపానికి గురై తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని మరణించాడు. వెంటనే కుటుంబ సభ్యులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు నిర్థారించారు. ఒక్కగానొక్క కొడుకు ఇలా తనువు చాలించడంతో తల్లి విమల స్పృహ కోల్పోయింది. ఈ ఘటన ఆ కుటుంబాన్ని ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం యష్ మృతి పట్ల సంతాపం తెలిపి.. నేడు స్కూల్ కు సెలవు ప్రకటించింది.
































