వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టుపై 280 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది రోహిత్ సేన. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు భారీ విజయాన్ని అందించాడు అశ్విన్. అలాగని రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి ఆటగాళ్ల కాంట్రిబ్యూషన్‌ను తక్కువ చేయడానికి లేదు. కానీ చెన్నై టెస్ట్ విజయంలో ఎక్కువ క్రెడిట్ మాత్రం అశ్విన్‌కే దక్కుతుంది. టీమ్ కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాట్‌తో అదుకోవడం, సెంచరీతో వీరవిహారం చేయడం, బౌలింగ్‌లో అదరగొట్టి బంగ్లాను కూల్చడం ద్వారా అతడు ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. అలాగే రికార్డుల మోత మోగించాడు. ఈ ఒక్క మ్యాచ్‌తో ఏకంగా 7 రికార్డులు తన పేరు మీద రాసుకున్నాడు.
చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో క్లిష్ట సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ 133 బంతుల్లో 113 పరుగుల సూపర్బ్ నాక్ ఆడాడు. రవీంద్ర జడేజాతో కలసి ఏడో వికెట్‌కు 199 పరుగులు జోడించాడు. ఆ తర్వాత బంగ్లా సెకండ్ ఇన్నింగ్స్ టైమ్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. పిచ్ నుంచి స్పిన్‌కు మద్దతు లభించకపోయినా ఫ్లైటెడ్ డెలివరీస్, లెంగ్త్ వేరియేషన్స్ ద్వారా ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. ఇలా టీమ్ సక్సెస్‌లో కీ రోల్ పోషించిన అశ్విన్ ఏకంగా 7 రికార్డులు బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌తో 37వ సారి 5 వికెట్ హాల్స్ సాధించాడు. అలాగే ఆరో టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇదే మ్యాచ్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్లో 750 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
సెంచరీ బాదిన ఓల్డెస్ట్ ఇండియన్ క్రికెటర్ల జాబితాలో అశ్విన్ నాలుగో ప్లేస్‌లో నిలిచాడు. అతడి వయసు 38 సంవత్సరాలు. ఈ లిస్ట్‌లో మాజీ క్రికెటర్ విజయ్ మర్చంట్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆయన 40 ఏళ్ల 21 రోజుల వయసులో ఇంగ్లండ్ మీద 1951లో సెంచరీ బాదాడు. లెజెండరీ బ్యాటర్స్ రాహుల్ ద్రవిడ్ (38 సంవత్సరాల 307 రోజులు), వినూ మన్కడ్ (38 సంవత్సరాల 269 రోజులు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 5 వికెట్ల ఘనతను అందుకున్న ఓల్డెస్ట్ ఇండియన్ బౌలర్‌గానూ అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించాడు. అలాగే ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్ల లిస్ట్‌లో ఆసీస్ దిగ్గజం షేర్ వార్న్ (37 సార్లు)తో కలసి సంయుక్తంగా రెండో ప్లేస్‌లో నిలిచాడు అశ్విన్. ఇలా ఒకే మ్యాచ్‌తో ఎన్నో రికార్డులు తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అశ్విన్ చెలరేగితే ఇలాగే ఉంటుందని, పాత రికార్డులకు పాతరేనని చెబుతున్నారు.