మెగా డీఎస్సీలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు 700 పోస్టులు మిగిలే పరిస్థితి కనిపిస్తోంది!
ఇప్పటివరకూ జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనతో అధికారులు ఈ అంచనాకు వచ్చారు. కాగా.. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. రెండో విడతలో 627 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా..
మంగళవారానికి వారిలో 480 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తిచేసి, సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారు. మొత్తంగా 15,600 మంది అభ్యర్థులే ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన పోస్టులను తర్వాత డీఎస్సీలో భర్తీ చేస్తారు.
కాగా.. కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈలోపే వారు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తారు.

































